28-09-2025 12:00:00 AM
భారత స్వాతంత్రోద్యమం ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్న సందర్భంలో గాంధీజీ, నెహ్రూ లాంటి వారు స్వతంత్రం కోసం శాంతియుత పోరాటం జరిపితే.. కొందరు విప్లవకారులు మాత్రం హింసా మార్గాన్ని ఏంచుకుని దేశ స్వాతంత్య్రం కోసం తమ రక్తాన్ని చిందించారు. అలాంటి విప్లవకారుల్లో షాహీద్ భగత్ సింగ్ ఒకరు. నేడు ఆయన 118వ జయంతి. 23 సంవత్సరాల వయస్సులోనే దేశానికి స్వాతంత్రం కావాలని, అసమానతలు లేని సమాజస్థాపనే లక్ష్యంగా పోరాడి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల చేతుల్లో ఉరి తీయబడిన ధీశాలీ.
మనిషిని మనిషి దోచుకునే విధానం పోవాలని.. దేశాన్ని, దేశం దోపిడీ చేసే విధానం ఉండకూడదని నమ్మిన బలమైన వ్యక్తి. భారతీయ యువత ఉప్పొంగే నెత్తుటి నరాల్లో ప్రవహించే ఉత్తేజం భగత్ సింగ్.. అతని పేరు చిరస్మరణీయం. అప్పటికే స్వాతంత్య్ర ఉద్యమంలో భాగస్వాములైన తల్లిదండ్రులు కిషన్ సింగ్, విద్యావతి, ఆంగ్లో- సిక్కు ఉద్యమంలో పాల్గొన్న ముత్తాత సర్ధార్ ఫతే సింగ్‌ల నుంచి స్పూర్తి పొందారు. 1928లో సైమన్ కమిషన్ లాహోర్ కు వచ్చినప్పుడు సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా లాలా లజపతి రాయ్ నేతృత్వంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. హాజరైన జన సందోహాన్ని చల్లా చదురు చేసేందుకు పోలీసులు లాఠీచార్జీ ప్రయోగించారు. ఈ లాఠీచార్జీలో లాలాలజపతిరాయ్ మరణించారు.
ఆయన మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుఖ్‌దేవ్ తాపర్, శివరాం రాజ్ గురు.. స్కాట్ ను చంపాలని నిర్ణయించుకున్నారు. అయితే వీరి దాడిలో స్కాట్ తృటిలో తప్పించుకోగా, బ్రిటీష్ అధికారి సాండర్స్ హతమయ్యాడు. ఆ తర్వాత భగత్ సింగ్ వేశం మార్చుకొని బ్రిటిష్‌కు వ్యతిరేకంగా యువతలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ తరుణంలో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ప్రజా భద్రత బిల్లు, వాణిజ్య వివాద బిల్లుపై చట్టం చేసేందుకు చర్చిస్తున్న వేళ, నిరసన తెలిపిన భగత్ సింగ్, భటుకేశ్వర్ దత్‌లు సెంట్రల్ లెజిస్లేటివ్ హాల్‌పై పొగ బాంబులు విసిరి పారిపోయే క్రమంలో బ్రిటీష్ అధికారులకు చిక్కారు.
సాండర్స్ హత్యలో దోషిగా తేలడంతో 1931, మార్చి 23న బ్రిటీష్ పాలకులు భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్‌గురులను ఉరి తీశారు. చింగారియాన్, మేరీ ఇంక్విలాబ్ యాత్ర వంటి రచనల నుంచి ఆయన స్ఫూర్తిని పొందారు. ఫ్రొఫెసర్ జై చంద్ర విద్యాలంకార్.. రౌలత్ కమిటీ రిపోర్టును తరగతి గదిలో బోధించినప్పుడు భగత్ సింగ్ రక్తం మరిగిపోయింది. ఇదే అతడిని ఒక గొప్ప దేశ భక్తుడిగా తీర్చిదిద్దింది. కేవలం విప్లవం ద్వారానే దేశానికి స్వాతంత్య్రం సిద్ధిస్తుందని నమ్మారు.
బాధల నుంచి మనల్ని మనం విముక్తి చేసుకోవాలంటే నిరంతరం అధ్యయనం చేయడం ఒక్కటే మార్గమన్నారు. నిరంతరం తన చొక్కా జేబులోనే పుస్తకాలను ఉంచుకొని సమయం దొరికినప్పుడల్లా చదివేవాడు. దేశంలో నేటి యువత డ్రగ్స్, మద్యం, మాదక ద్రవ్యాల మత్తులో మునిగి తేలుతుంది. యువతే దేశానికి ఆయువుపట్టు. 23 ఏళ్ల వయసులో దేశ స్వాతంత్య్ర కాంక్ష కోసం తన ప్రాణాలను అర్పించిన భగత్ సింగ్ జీవితం ప్రతి ఒక్కరికి ప్రేరణగా నిలుస్తుంది. మనిషి ఎంతటి విపత్తులోనైనా తన ఆదర్శలాలకు కట్టుబడి ఉండాలని, త్యాగం లేకుండా ఏది సాధించలేమనేది భగత్ సింగ్ కాంక్ష. భగత్ సింగ్ స్ఫూర్తితో నేటి యువత దేశాభివృద్ధికి కృషి చేయాలి.
వీరభద్రం, 9398535441