7 March, 2026 | 1:03 PM

పదవ తరగతి వార్షిక పరీక్షలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి

06-03-2026 12:00 AM
  1. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

పదవ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలపై అవగాహన 

కూసుమంచి, మార్చి 5 (విజయ క్రాంతి): విద్యార్దులు ఏలాంటి భయం, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పదవ తరగతి వార్షిక పరీక్షలకు హాజరు కావాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. గురువారం ఖమ్మం రూరల్ మండలం కోదాడ క్రాస్ రోడ్ వద్ద గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులం (బాలికల) ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా తరగతి గదులు, పరిసరాలను తిరుగుతూ, మౌళిక సదుపాయాలు, వంటగది పరిశుభ్రత, ఆహార నాణ్యత, నిల్వ విధానాలు, స్టోర్ రూమ్లో ఉన్న బియ్యం, పప్పులు, కూరగాయలు, కోడిగుడ్డులు,  ఇతర సరుకుల సామగ్రిని తనిఖీ చేసి రికార్డు లెక్కలను క్షుణంగా తనిఖీ చేశారు.

విద్యార్థులకు అందిస్తున్న కామన్ మెనూ ప్రకారం వండుతున్న ఆహారం అన్నం, కూరలను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా ముచ్చటించి పాఠశాలలో కల్పిస్తున్న వసతుల గురించి, మెస్ కమిటీ వ్యవహారాలపై వివరాలు అడిగి తెలుసుకుని, కమిటీ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మెనూకు అనుగుణంగా నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. 

అనంతరం కలెక్టర్ పదవ తరగతి గది సందర్శించి, విద్యార్థులతో ముచ్చటించారు. ఏలాంటి భయం, ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలకు సిద్దం కావాలని హితబోద చేస్తూ, అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ విద్యార్థులు చదువు పై దృష్టి పెట్టి పరీక్షలకు హాజరు కావాలని,  పరీక్షలకు మరో 9 రోజులు ఉందని, ఉన్న సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

మనం ఎంత సమయం చదువుతున్నాం అనే దానికంటే ఎంత శ్రద్ధగా చదువుతున్నా మనేది చాలా ముఖ్యమని తెలిపారు. ఉపాధ్యాయుల సహకారం తీసుకుంటూ పరీక్షలకు బాగా సన్నద్ధం కావాలని, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని కలెక్టర్ సూచించారు. పదవ తరగతి మెయిన్ పరీక్షల కంటే ముందు వీలైనంత మేర అధిక సంఖ్యలో ప్రీ ఫైనల్ పరీక్షలు రాయాలని తెలిపారు. పరీక్షలు అధికంగా రాయడం వల్ల తుది పరీక్షలను ఎటువంటి ఒత్తిడి లేకుండా సులభంగా రాయగలుగుతామని అన్నారు. 

మనం చదివిన దానికంటే రాసిన అంశాలు అధికంగా గుర్తుండిపోతాయని కలెక్టర్ తెలిపారు. ఒత్తిడి ని అధికమిచ్చేందుకు కొంత సమయం శ్వాస సంబంధిత వ్యాయామాలు, యోగా లాంటివి విద్యార్థులు క్రమం తప్పకుండా చేయాలని సూచించారు.  పరీక్షల సమయంలో విద్యార్థులు నిద్రలేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఉండవద్దని, ప్రతి రోజు కనీసం 7 నుంచి 8 గంటల పాటు మంచి నిద్ర ఉండాలని తెలిపారు.

బయట ఆహారం తీసుకోవద్దని, బయట ఎక్కువ తిరగవద్దని, మంచినీరు తగినంత త్రాగాలని, ఆర్యోగంగా ఉంటే చదువు మీద దృష్టి పెడుతామని కలెక్టర్ సూచించారు. మనం చదువు పై నమ్మకంగా ఉంటూ పరీక్షలకు హాజరైతే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. నెల రోజుల పాటు పదవ తరగతి పరీక్షలు ఉంటాయని, విద్యార్థులు ఏకాగ్రతతో సిద్దమైతే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిసీవో జ్యోతి, ప్రిన్సిపాల్ కె. శ్రీ లత, వైస్ ప్రిన్సిపాల్ డి. సంధ్యారాణి, ఉపాధ్యాయులు సిహెచ్. ఏల్లిశ్వరి, జి. సంధ్యారాణి, కె. విజయలక్ష్మి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.