10-08-2024 04:44:42 AM
నల్లగొండ, ఆగస్టు 9 (విజయక్రాంతి): నాగార్జున సాగర్‌కు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో స్థిరంగా కొనసాగుతున్నది. రిజర్వాయర్‌లోకి 4 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో వచ్చిన వరదను వచ్చినట్లు 26 క్రస్టుగేట్ల ద్వారా నదిలోకి వదులుతున్నారు. సాగర్ నీటిమట్టం 590 అడుగులు (312.5050 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 587.60 అడుగులు (312 టీఎంసీలు)గా ఉంది. రిజర్వాయర్ నుంచి సాగర్ ఎడమ కాల్వకు 8367 క్యూసెక్కులు, కుడి కాల్వకు 8680 క్యూసెక్కులు, ప్రధాన విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగిస్తూ మరో 29 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
సాగర్ నుంచి భారీగా ఇన్‌ఫ్లో వస్తుండటంతో పులిచింతల ప్రాజెక్టు 11 క్రస్టుగేట్లను ఎత్తారు. 2.30 లక్షల క్యూసెక్కుల ప్రవాహం దిగువన ప్రకాశం బ్యారేజీ వైపు వెళ్తోంది. విద్యుద్యుత్పుత్తి చేస్తూ మరో 12 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పది క్రస్టుగేట్లు 14 అడుగుల మేర ఎత్తి 3.50 లక్షల క్యూసెక్కులు, కుడి, ఎడమగుట్టు విద్యుత్ కేంద్రాల్లో కరెంట్ ఉత్పత్తి చేస్తూ 64 వేల క్యూసెక్కులు వదులుతుండటంతో ఈ వరద నేరుగా సాగర్‌కు చేరుతోంది.
భీమా నుంచి పెరుగుతున్న వరద
హైదరాబాద్(విజయక్రాంతి): కృష్ణానదికి ఎగువ నుంచి వరదలు తగ్గుముఖం పట్టినా ఉప నది అయిన భీమా నుంచి వరద పెరిగింది. దాంతో జూరాలకు సుమారు 3 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. భీమా నదిపై కర్ణాటకలో ఉన్న చివరి ప్రాజెక్టు సన్నతి బ్యారేజీ నుంచి శుక్రవారం రాత్రి 1.15 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు.
గౌరవెల్లి ప్రాజెక్టుకు రూ.437కోట్లు
హైదరాబాద్(విజయక్రాంతి): గౌరవెల్లి ప్రాజెక్టుకు రూ.437కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసిం ది. మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్, స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గాలకు గోదావరి జలాలను తీసుకొచ్చి భూ ములను సస్యశ్యామలం చేసేందుకు గౌరవెల్లి ప్రాజెక్టును చేపట్టారు. దీంతోపాటు ఎస్‌ఆర్‌ఎస్పీ ఐఎప్‌ఎఫ్‌సిలోని ప్యాకేజీ నెం.7 లోని పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు సవరించిన అంచనాల మేరకు రూ.437 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1.06లక్షల ఎకరాలకు ఆయకట్టు అందించేందుకు ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు.