calender_icon.png 15 November, 2025 | 8:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్యం అందక యువకుడి మృతి

10-08-2024 04:42:36 AM

  1. బురద కారణంగా గ్రామానికి చేరుకోని అంబులెన్స్ 
  2. మూడు కిలోమీటర్లు ఎడ్లబండిపై తీసుకొచ్చినా దక్కని ప్రాణం

మంచిర్యాల, ఆగస్టు 9 (విజయక్రాంతి): అపస్మారక స్థితిలో పడి ఉన్న యువకుడికి తక్షణ వైద్యం అందించేందుకు కుటుంబ సభ్యులు 108 ఆంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్ హుటాహుటిన బయల్దేరినప్పటికీ మార్గమధ్యంలో బురదమయమైన రహదారి అడ్డంకిగా మారింది. దీంతో యువకుడిని కుటుంబ సభ్యులు ఎడ్లబండిపై అంబులెన్స్‌కు ఎదురు తీసుకొచ్చినా ఫలితం లేకపోయింది. మార్గమధ్యంలోనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నెన్నెల మండలంలో చోటుచేసుకున్నది.

మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నెన్నెల మండలం కోనంపేటకు చెందిన జింజిరి జస్వంత్(17) శుక్రవారం ఉదయం తల్లిదండ్రులు బాపు, బుజ్జక్కలతో కలిసి పొలం పనులకు వెళ్లాడు. పనులు ముగించుకొని ఇంటిరి తిరిగి వస్తుండగా బహిర్భూమికి వెళ్లి వస్తానని ఆగిన జస్వంత్ ఇంటికి అరగంట గడిచినా తిరిగి రాలేదు. జస్వంత్ కోసం తల్లిదండ్రులు వెతుకుతున్న క్రమంలో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించారు.

వెంటనే 108 ఆంబులెన్స్‌కు సమాచారం అందించారు. నెన్నెల నుంచి కోనంపేటకు బయలుదేరిన ఆంబులెన్సు బురద కారణంగా మూడు కిలో మీటర్ల దూరంలోనే నిలిపివేశారు. దీంతో కుటుంబ సభ్యులు ఎడ్లబండిపై యువకుడిని తీసుకెళ్తున్నారు. మార్గమధ్యంలోనే యువకుడు మృతిచెందాడు. గ్రామానికి సరైన రవాణా సౌకర్యం ఉంటే యువకుడి తమ కుమారుడి ప్రాణాలు దక్కేవని తల్లిదండ్రులు వాపోయారు.