16-09-2025 02:50:39 PM
మెదక్ ఎంపీ రఘునందన్ రావు హెచ్చరిక..
రామచంద్రపురం: సంగారెడ్డి జిల్లా బీహెచ్ఈఎల్ చౌరస్తా పక్కన ఉన్న నాలాను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్(GHMC Commissioner R.V. Karnan)తో కలిసి మెదక్ ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, తాను ఎంపీగా గెలిచినప్పటి నుంచి బీహెచ్ఈఎల్ చౌరస్తా నుంచి అమీన్‌పూర్, సుల్తాన్‌పూర్ మెడికల్ డివైజ్ పార్కు వరకు రహదారి నిర్మాణానికి పేపర్‌వర్క్ పూర్తి చేసి జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అయితే అధికారుల మీనమేషాల వల్ల పనులు ముందుకు సాగలేదని విమర్శించారు. నెల రోజులుగా కమిషనర్ కర్ణన్‌ను అనుసరిస్తూ, చివరికి ఈ రోజు క్షేత్రస్థాయిలో ఆయనతో కలిసి పర్యటించాల్సి వచ్చిందని తెలిపారు. నాలా పక్కన, రహదారి ఇరువైపులా ఉన్న ఎన్‌క్రోచ్‌మెంట్‌లను తొలగించి వెంటనే పనులు ప్రారంభించాలని సూచించారు. వంద కోట్ల రూపాయలతో వంద రోజుల్లో రహదారి పనులు పూర్తి చేయకపోతే, బీజేపీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగుతామని రఘునందన్ రావు హెచ్చరించారు.