16-09-2025 03:05:39 PM
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేణి శంకర్..
ఘనంగా తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవలు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ఎదుట సిపిఐ జెండాను జిల్లా కార్యదర్శి బద్రి సాయి కుమార్ ఎగరవేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట సర్వ హక్కులు సిపిఐ పార్టీకే దక్కుతాయని, దానికి పేటెంట్ తామేనని, ఎర్ర జెండా నీడలోనే సాయుధ పోరాటం జరిగిందని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం జరగడానికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. ఆనాడు ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేదని, నైజాం ముఖాలు చేరి ప్రజలను చిత్రహింసలకు గురి చేసేవారన్నారు. ఈ క్రమంలోనే ఆంధ్ర మహాసభ ఏర్పడి విరోచిత పోరాటాలు చేస్తూ 10 లక్షల ఎకరాల భూముల్ని ప్రజలకు పంచడం జరిగిందన్నారు.
ప్రపంచంలో ఎక్కడ ఇంతటి ఘన పోరాటం జరగలేదని, దేశానికి స్వాతంత్రం వచ్చిన తెలంగాణకు స్వాతంత్రం రాలేదని, తెలంగాణతో పాటు కర్ణాటకలోని మూడు, మహారాష్ట్రలోని ఐదు జిల్లాలతో కలిసి తెలంగాణ హైదరాబాద్ సంస్థానం ఉండేదన్నారు, నాడు నైజాం నవాబు చేతిలో ఉండగా ప్రత్యేక దేశంగా ప్రకటించుకునే ప్రయత్నం జరిగిందన్నారు. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, సోయాబుల్లాఖాన్, వంటి అనేక మంది పోరాటం ఫలితంగా హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగిందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం హిందువులకు వ్యతిరేకంగా జరిగిందని బిజెపి దొంగ మాటలు మాట్లాడుతుందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న బందగి, సోయాబుల్లాఖాన్, లాంటి వారు ముస్లింలే కదా అని అన్నారు. అసలు బిజెపి ఆనవాళ్లు అప్పుడేమైనా ఉన్నాయా అని ఎద్దేవా చేశారు. పోరాట యోధుల విగ్రహాలను హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించాలని, పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను లిఖించాలని డిమాండ్ చేశారు.పాలకుల తీరు మారానందున సామాజిక ప్రజా తెలంగాణ కోసం మరో పోరాటానికి యువత సిద్ధంగా ఉండాలని, హిందూ,ముస్లిం తగాధాలు పెట్టే వికృత ఆగడాలను ఎదిరించాలని అన్నారు.
సిపిఐ సీనియర్ నాయకులు బద్రి సత్యనారాయణ మాట్లాడుతూ సెప్టెంబర్ 17ను తెలంగాణ విలీన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని కోరారు. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తూ నైజాం పై పోరాటాన్ని హిందూ, ముస్లింల గొడవగా చిత్రీకరిస్తున్నదని అన్నారు. నాటి పోరాటంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ పాత్ర ఏ మాత్రం లేదని, సాయుధ పోరాటానికి వారసులు ఒక్క కమ్యూనిస్టులేనని అన్నారు. భూస్వాములకు, దోపిడీ దారులకు నైజాం సర్కారు అండగా ఉండడం వల్లనే నైజాం సర్కారు పై సాయుధ పోరాటానికి సిపిఐ పిలుపునిచ్చిందన్నారు.. నాటి పోరాటంలో దొడ్డి కొమరయ్య మొదలుకొని నాలుగున్నర వేల మంది వీరులు అమరులయ్యారని, నేడు తెలంగాణలో గ్రామ గ్రామాన నాటి నెత్తుటి ఆనవాళ్ళు ఉన్నాయని అన్నారు. బీజేపీ కు తెలంగాణ విలీన దినోత్సవంపై మాట్లాడే హక్కు లేదన్నారు.
నాలుగున్నర వేల కమ్యూనిస్టు అమరుల త్యాగాలతో ఎర్రబారిన తెలంగాణ నేల..నిజాం నిరంకుశ పాలనను కూలదోసింది కమ్యునిస్టులే. పటేల్ సైన్యం కాదు.తెలంగాణ సాయుధ పోరాట ఫలితంగానే నిజాం నిరంకుశ పాలన రద్దయ్యింది. పటేల్ సైనిక చర్య వల్ల కాదన్నారు.10 లక్షల ఎకరాల భూమి పేదలకు పంచి, 3 వేల గ్రామాలను విముక్తి చేసింది కమ్యూనిస్టులే అని గుర్తు చేశారు. పటేల్ చీకటి ఒప్పంద ఫలితమే నిజాం రాజుకు గవర్నర్ పదవి. తెలంగాణ సాయుధ పోరాటాన్ని, అమర వీరులను స్మరించుకుందమన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని, అమరుల జీవిత చరిత్రను.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాఠ్యాంశాలుగా చేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి భోగే ఉపేందుర్, సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పిడుగు శంకర్, రాయిల్లా నర్సయ్య, కోదురుపాక మహేష్, బావునే వికాస్, వర్కోల్ రాకేష్,సీపీఐ అసిఫాబాద్ మండల కార్యదర్శి నాయిని వెంకటేష్, సీపీఐ టౌన్ కార్యదర్శి అజయ్,రాజశేఖర్, వి శ్రీకాంత్, జె. విష్ణు తదితరులు పాల్గొన్నారు.