calender_icon.png 16 September, 2025 | 4:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

16-09-2025 02:43:13 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఈ నెల 17వ తేదీన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే(District Collector Venkatesh Dhotre) అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం ఆవరణలో నిర్వహించనున్న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావుతో కలిసి పోలీస్, రెవెన్యూ, పంచాయితీ రాజ్, వైద్య ఆరోగ్య, విద్యుత్ శాఖల అధికారులు, మిషన్ భగీరథ అధికారులు, మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని తెలిపారు. వేడుకల ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు.

వేడుకలలో భాగంగా జిల్లా అభివృద్ధిపై సందేశం ఇస్తారని, కార్యక్రమానికి వచ్చే వారికి త్రాగునీరు, అల్పాహారం, నీడ, ఇతర అవసరమైన ఏర్పాట్లు చేయాలని, పాత్రికేయులకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేయాలని, వేదిక అలంకరణ, పోడియం, సౌండ్ సిస్టం ఏర్పాటు చేయాలని తెలిపారు. పారిశుద్ధ్య పనులు, నిరంతర విద్యుత్ సరఫరా చేయడంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అంబులెన్స్, అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో వాహనాన్ని అందుబాటులో ఉంచాలని తెలిపారు. ప్రముఖులను ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించాలని, కలెక్టరేట్ లో పనిచేసే అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొనాలని, ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.