calender_icon.png 22 November, 2025 | 11:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూర్యాపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా నర్సయ్య

22-11-2025 11:33:07 PM

సూర్యాపేట (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గుడిపాటి నర్సయ్యను నియమిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని వెలుగుపల్లి గ్రామంలో 1971వ సంవత్సరంలో నర్సయ్య జన్మించగా 1990 నుండి 95 వరకు సీపీఐ(ఎంఎల్) చంద్రపుల్లారెడ్డి నక్సల్స్ గ్రూపులో కొనసాగుతూ అజ్ఞాతవాసంలో ఉన్నారు. మాజీ మంత్రివర్యులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి సూచనల మేరకు 1995 డిసెంబర్లో నాటి నల్గొండ జిల్లా ఎస్పీ రవిగుప్తా సమక్షంలో సరెండరై జనజీవన స్రవంతిలో కలిశారు. తదుపరి 2001 నుండి 2006 వరకు తుంగతుర్తి జడ్పిటిసిగా, 2006 నుండి 2008 వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.

2009 సంవత్సరంలో మొదటిసారి తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. 2014వ సంవత్సరంలో 2వసారి తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ప్రకటించింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ జేఏసీకి ఒప్పందం ప్రకారం ఇచ్చిన టికెట్ ను రద్దు చేయాల్సి వచ్చింది. 2014 నుండి 2018 వరకు టీపీసీసీ సభ్యుడిగా, 2009 నుండి 2023 వరకు తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా పనిచేశారు. మొక్కవోని దీక్షతో పనిచేసిన గుడిపాటి నర్సయ్యకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నేడు డీసీసీ అధ్యక్షునిగా నియమించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.