30 June, 2026 | 5:00 AM

పిచ్ గురించి చెప్పడం కష్టం

07-06-2024 01:52 AM

న్యూయార్క్: టీ20 ప్రపంచకప్‌కు అమెరికా తొలిసారి ఆతిథ్యమిస్తున్న వేళ మ్యాచ్‌లు జరుగుతున్న నసావు కౌంటీ స్టేడియంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం 5 నెలల్లోనే రూపొందించిన పిచ్ ఎవరికి అంతుచిక్కని విధంగా తయారైంది. ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఈ స్టేడియంలో మూడు మ్యాచ్‌లు జరగ్గా అన్నింట్లో స్వల్ప స్కోర్లే నమోదయ్యాయి. పరుగులు రావడం కష్టమైన పిచ్‌పై బౌలర్లు చెలరేగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఐర్లాండ్‌తో మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పిచ్‌పై స్పందించాడు. ‘ఐదు నెలల క్రితమే నిర్మించిన స్టేడియం, పిచ్ గురించి చెప్పడం కష్టమే.

బౌలింగ్‌కు అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్‌పై పరుగులు చేయడం కఠినంగా మారింది. సెకండ్ బ్యాటింగ్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించే ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాం. జూన్ 9న ఇదే స్టేడియంలో పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడబోతున్నాం. ఈ మ్యాచ్‌లోనూ బ్యాటింగ్‌లో కఠిన పరిస్థితే ఎదురయ్యేలా ఉంది. నా గాయంపై ఆందోళన వద్దు. ప్రస్తుతం ఫిట్‌గానే ఉన్నా’ అని రోహిత్ తెలిపాడు. ‘అమెరికాలో క్రికెట్ ఆడడం కొత్తగా ఉంది. పిచ్ ఎలా ఉంటుందో అని ఆసక్తిగా ఉండేది. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో బంతి రెండు వైపులా స్వింగ్ అవుతోంది. బౌలర్లకు పూర్తిగా సహకరిస్తున్న పిచ్‌పై ఎలాంటి ఫిర్యాదులు లేవు’ అని స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా పేర్కొన్నాడు. 

మార్చేదేలేదు : ఐసీసీ

బౌలర్లకు అనుకూలంగా మారిన న్యూయార్క్ డ్రాప్ ఇన్ పిచ్‌పై బీసీసీఐ సహా మాజీ క్రికెటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రపంచకప్‌లో న్యూయార్క్‌లో జరగాల్సిన మ్యాచ్‌ల వేదికలను మార్చాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ల వేదికలను మార్చే ప్రసక్తే లేదని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) స్పష్టం చేసింది. ‘న్యూయా ర్క్ లో జరగాల్సిన మ్యాచ్‌ల ను ఫ్లోరిడా లేదా టెక్సస్‌కు మార్చే ఉద్దేశం లేదు’ అని ఐసీసీ పేర్కొంది.