23-01-2026 01:28:14 PM
భిక్కనూర్, జనవరి 23 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం రామేశ్వర్‌పల్లి గ్రామంలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువ ఓటర్లు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులతో కలిసి ఓటరు ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో ఓటు హక్కు కీలకమని, ప్రతి ఒక్కరూ కుల, మత, ప్రాంతీయ విభేదాలకు అతీతంగా నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీసీసీబీ మాజీ చైర్మన్ ఎడ్ల రాజ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి హాజరై మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటరు పాత్ర అత్యంత ముఖ్యమని తెలిపారు. ఓటు హక్కు వినియోగంతోనే ప్రజల ఆశయాలు ప్రతిఫలిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చేపూరి రాణి రాజు, ఉపసర్పంచ్ వినోద్ గౌడ్, వార్డు సభ్యులు మద్ది కృష్ణారెడ్డి, తేలు భవాని పాల్గొన్నారు. అలాగే జీపీవో సంతోష్, పంచాయతీ కార్యదర్శి శ్యామ్, బీఎల్‌వోలు, పాఠశాల ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.