23-01-2026 08:11:05 PM
18 సంవత్సరా నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలి
ఐటీడీఏ ఏపీవో డేవిడ్ రాజ్
భద్రాచలం,(విజయక్రాంతి): ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైన వజ్రాయుధమని,18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హత గల పౌరుడు తప్పనిసరిగా ఎటువంటి ప్రలోభాలకు అవకాశం ఇవ్వకుండా ఓటరుగా నమోదు చేసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ అన్నారు. శుక్రవారం నాడు ఐటిడిఏ ప్రాంగణంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐటీడీఏ యూనిట్ అధికారులు సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులతో కలిసి ఓటర్ల ప్రతిజ్ఞ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కుకు ఎంతో విలువ ఉంది.
ఆ విలువను ప్రతి ఓటరు తెలుసుకొని తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఓటు హక్కుపై విస్తృత అవగాహన కల్పించడం ద్వారా సమర్థవంతమైన, బాధ్యతాయుతమైన పాలనను ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు. అధికారులు, యంత్రాంగం 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హత గల గిరిజన యువత ఓటరుగా నమోదు చేసుకునేలా, అలాగే తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకునేలా గిరిజన ప్రజల్లో అవగాహన కల్పిస్తూ విస్తృత స్థాయిలో ప్రోత్సహించాలని ఆయన అన్నారు. ఓటర్లను ఎన్నికల ప్రక్రియలో విధిగా పాల్గొనేలా ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం జనవరి 25న దేశవ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఓటు హక్కు కోసం గతంలో ఎన్నో త్యాగాలు, పోరాటాలు జరిగాయని, ఆ విలువను గుర్తించి అర్హత గల ప్రతినిధులను ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటరుపై ఉందని అన్నారు. ఈ సందర్భంగా అధికారులు, ఉద్యోగులు, విద్యార్థినీ విద్యార్థులతో కలిసి భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల నిర్వహణను పరిరక్షిస్తామని, మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేశారు.