05-05-2025 12:34:10 AM
హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి) : మెడికల్ ప్రవేశ పరీక్ష కోసం నిర్వహించే నీట్ (జాతీయ అర్హత పరీక్ష) ఆదివారం ముగిసింది. ప్రవేశ పరీక్ష కోసం హైదరాబాదులో 62 కేంద్రాలు, రంగారెడ్డి జిల్లాలో 19 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్ష మధ్యాహ్నం రెండు గంటల నుంచి 5 గంటల వరకు ఉండగా ఆయా పరీక్ష కేంద్రాల లోకి అధికారులు గంటన్నర ముం దే విద్యార్థులను అనుమతించారు.
ఆయా పరీక్షల కేంద్రాల వద్ద ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. పరీక్ష కేంద్రాల్లో వద్ద పోలీసు బందోబస్తు తో పాటు 144 సెక్షన్ విధించారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుతోపాటు తాగునీటి సౌకర్యం, మెడికల్ సిబ్బందిని ఆయా పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు అందుబాటులో ఉంచారు.
సెంట్రల్ యూనివర్సిటీలో 6000 మంది విద్యార్థులు
శేర్లింగంపల్లి నియోజకవర్గం లోని గచ్చిబౌలి సమీపంలో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నీట్ పరీక్ష మొత్తం 6000 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు పరీక్షా కేంద్రంలో రాస్తుండగా వారి తల్లిదండ్రులు సహాయకులు బయట వారికోసం నిరీక్షించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, వారి వెంట వచ్చిన సహాయకులతో యూనివర్సిటీ ఆ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. ఒకేసారి విద్యార్థులంతా రోడ్డుపై రావడంతో ట్రాఫిక్ భారీగా జామ్ అయింది.