calender_icon.png 3 November, 2025 | 12:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ శాఖ నిర్లక్ష్యం.. చెట్ల వ్యర్ధం తొలగించక ప్రజలకు ఇబ్బంది

02-11-2025 06:01:44 PM

రామచంద్రపురం: సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణ పరిధిలో విద్యుత్ శాఖ అధికారులు ఇటీవల విద్యుత్ తీగలకు ఆటంకం కలిగిస్తున్న చెట్ల కొమ్మలను నరికించారు. అయితే నరికిన చెట్ల వేస్టేజ్‌ను తొలగించకపోవడంతో పట్టణంలో అనేక ప్రాంతాల్లో చెత్త పేరుకుపోయి, ప్రజలకు, వ్యాపారస్తులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. విద్యుత్ సరఫరా వ్యవస్థలో ఆటంకాలు రాకుండా ముందస్తు చర్యగా చెట్లను నరికడం అభినందనీయమని ప్రజలు చెబుతున్నప్పటికీ, నరికిన చెట్లను అలాగే వదిలేయడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. రహదారుల పక్కన, షాపుల ముందు పెద్ద పెద్ద కొమ్మలు, ఆకులు పేరుకుపోవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నారు.

వర్షం పడినప్పుడు ఈ వ్యర్ధం తడి చెత్తగా మారి దుర్వాసనతో పాటు దోమల పెరుగుదలకు దారితీస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాంత వ్యాపారులు మాట్లాడుతూ.. “విద్యుత్ శాఖ అధికారులు చెట్లను నరికారు కానీ వేస్టేజ్‌ను అలాగే వదిలేశారు. ఈ చెత్తతో మాకు వ్యాపారానికి ఇబ్బంది కలుగుతోంది. మున్సిపల్ అధికారులు, విద్యుత్ శాఖ సిబ్బంది వెంటనే స్పందించి చెత్తను తొలగించాలి” అని అన్నారు. ఇక రహదారులపై పేరుకుపోయిన కొమ్మలు ట్రాఫిక్‌కు కూడా అడ్డంకిగా మారాయి. పలు ప్రాంతాల్లో రోడ్డుపై చెట్ల కొమ్మలు పడిపోవడంతో వాహనదారులు ప్రమాదానికి గురయ్యే పరిస్థితి నెలకొంది. స్థానికులు చెట్ల వ్యర్ధాన్ని తొలగించకపోతే మరింత ప్రమాదం సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.