21-11-2025 09:54:04 PM
అదనపు కలెక్టర్ అశోక్ కుమార్
కాటారం,(మహాముత్తారం),(విజయక్రాంతి): వరి ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం పనికిరాదని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ అన్నారు. భూపాలపల్లి మండలంలోని ఆజాంనగర్, మహముత్తారం మండలంలోని మొనాజీపేట, బొర్లగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ ఆకస్మికంగా సందర్శించి, ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్శన సందర్భంగా అదనపు కలెక్టర్ పీపీసీ ఇన్‌చార్జ్‌లను ఉద్దేశిస్తూ, రైతుల నుండి ప్యాడీ కొనుగోలు సమయంలో ఎఫ్ఏక్యూ ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ప్రతి రైతు నుండి కొనుగోలు చేసిన ధాన్యం క్రమ సంఖ్యల నమోదు చేసి, పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలుపై నిర్వహించిన శిక్షణా కార్యక్రమాల్లో ఇచ్చిన సూచనల ప్రకారం, ప్రతి పర్చేసింగ్ సెంటర్‌లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ వివరాలు, కొనుగోలు, ఇతర సంబంధిత సమాచారాన్ని స్పష్టంగా ప్రదర్శించే నోటీస్ బోర్డులను తప్పని సరిగా ఏర్పాటు చేయాలని సూచించారు.
రోజువారీ ప్రక్రియలో భాగంగా, తేమశాత పరిశీలన తప్పనిసరి అని, దీనికి సంబంధించిన రికార్డులను ప్రత్యేక రిజిస్టర్‌లో ప్రతిరోజూ నమోదు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం విడుదల చేసిన ప్యాడీ కొనుగోలు మార్గదర్శకాలను కచ్చితంగా అనుసరించాలని, ఏ విధమైన నిర్లక్ష్యం జగితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఇప్పటికే కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిర్దేశిత రైస్ మిల్లులకు వెంటనే తరలించడంతో పాటు రవాణా వివరాలను సమయానికి నమోదు చేయాలని సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.