calender_icon.png 14 August, 2025 | 11:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మణిపూర్‌లో శాంతిపై కొత్త ఆశలు

01-01-2025 12:00:00 AM

బీరేన్ సింగ్ క్షమాపణలు

మరోవైపు ఇప్పటిదాకా అల్లర్లను శాం తిభద్రతల సమస్యగానే చూస్తూ వచ్చిన ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌కు కూడా పరిస్థితి అర్థమయినట్లు ఉంది. అందుకే నూత న సంవత్సరం సందర్భంగా  రాష్ట్రంలో గత ఏడాదిన్నరగా చోటు చేసుకున్న హింసా కాండపై రాష్ట్రప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఈ ఏడాదంతా ఎంతో కష్టంగా గడిచిపోయిందని, అందుకు రాష్ట్రప్రజలకు క్షమాపణలు చెబుతున్నానని మంగళవారం ఆయన మీడియా సమావేశంలో చెప్పడం గమనార్హం. జరిగిన తప్పిదాలను క్షమించి, చేదు జ్ఞాపకాలను మరిచి పోయి కొత్త జీవితాలను ఆరంభిద్దామని, అన్నిజాతుల వారు కలిసికట్టుగా జీవించాలని విజ్ఞప్తి చేస్తున్నానని ముఖ్యమంత్రి చెప్పారు. కొత్త ఏడాదిలో రాష్ట్రంలో శాంతి నెలకొంటుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.  

ఏ రాష్ట్రంలోనైనా ముఖ్యంగా ఈశా న్య రాష్ట్రాల్లో  అశాంతి దీర్ఘకాలం కొనసాగడం దేశానికి ఎంతమాత్రం మం చిది కాదు. మణిపూర్ విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఏడాదికి పైగా జాతి విద్వేషాలతో అట్టడుకుతున్న ఈశాన్య రాష్ట్రమై న మణిపూర్‌లో తిరిగి మామూలు పరిస్థితులను నెలకొల్పే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఇంతకాలం శాంతి భద్రతల సమస్యగానే చూసి న కేంద్రం ఇప్పుడు రాష్ట్రంలో ప్రజల మధ్య తిరిగి విశ్వాసాన్ని ప్రోది చేసే దిశగా చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాను మణిపూర్ గవర్నర్‌గా నియమించింది. దీంతో సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధిగా ప్రయత్నిస్తుందన్న ఆశలు చిగురిస్తున్నాయి. ఎందుకంటే హోం కార్యద ర్శిగా భల్లాకు మణిపూర్ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది.

ఏడాదిన్నరగా మంటలు

జాతుల మధ్య వైరంతో గత ఏడాదిన్నరగా మణిపూర్ అట్టుడుకుతోంది. ప్రభు త్వ ప్రయోజనాలు పొందే విషయంలో మెజారిటీ మెయితీ, గిరిజన కుకీ జాతుల మధ్య మొదలైన అల్లర్లలో ఇప్పటివరకు 300 మందికిపైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులుగా మారారు. శాంతిభద్రతల అదుపు విషయంలో రాష్ట్రప్రభు త్వం చేతులెత్తేయడంతో గత 19 నెలలుగా అక్కడ కేంద్ర బలగాలే పహరా కాస్తున్నా యి.

తప్పుడు ప్రచారాల కట్టడి పేరుతో ఇంటర్నెట్‌పైన కూడా చాలాకాలంగా ఆంక్షలు విధించింది అక్కడి ప్రభుత్వం. ఒక వైపు మహిళలను నగ్నంగా ఊరేగించి గ్యాంగ్ రేప్ చేసి చంపడం, భార్యాభర్తలను తగులబెట్టడం, అన్నాచెల్లెళ్లను హతమార్చడం తరహా ఘటనలు మణిపూర్ గడ్డపై నుంచి వెలుగులోకి రావడంతో యావత్తు సభ్య సమాజం వణికిపోయింది.

మరోవైపు రాజకీయంగా ఈ అంశం దేశాన్ని కుదిపేసింది. అటు పార్లమెంటులో, ఇటు బయటా ప్రతిపక్షాలన్నీ కేంద్రప్రభుత్వం తీరును తప్పుబట్టినప్పటికీ మోదీ సర్కార్ మాత్రం ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగిం దే తప్ప సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించిన పాపాన పోలేదు.అల్లర్లను కట్టడి చేయడంలో విఫలమైన బీరేన్ సిం గ్‌ను పదవినుంచి తప్పించలని విపక్షాలు ఎంతగా డిమాండ్ చేసినా మోదీ మాత్రం ఆయనకే మద్దతుగా నిలిచారు.

సుప్రీంకో ర్టు జోక్యం చేసుకుని రాష్ట్రంలోని పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేసే దాకా కేంద్రంలో చలనమే రాలేదని చెప్పాలి. అన్ని ఘర్షణల్లాగే దీన్నీ చూసిందే తప్ప సున్నితమైన ఈశాన్య భారతంలో తలెత్తిన ఈ సమస్య మొత్తం ఆ ప్రాంతంపై ప్రభావం చూపిస్తుందన్న ఆలోచనే చేయలేదు. అయితే ఏడాదిన్నర గడిచినా సమస్య పరిష్కారం దిశగా చర్యలు మొదలు కాకపోవడంతో మణిపూర్ రావణ కాష్టంలాగా రగులుతూ నే ఉంటుందా అనే భయాలు వ్యక్తమయ్యాయి.

రిజర్వేషన్లే అసలు సమస్య

మణిపూర్ జనాభాలో 53 శాతం దాకా మెయితీలు ఉండగా, 43 శాతం కుకీలు, నాగాలు లాంటి ఆదివాసీలు ఉన్నారు. మైదాన ప్రాంతంలో ఉన్న మెయితీలు రాజకీయంగా, ఆర్థికంగా మిగతా వారికన్నా మెరుగైన స్థితిలో ఉన్నారు. అయితే వారు అంతటితో సంతృప్తి చెందక పోగా  కుకీలు, నాగాలు లాంటి గిరిజనులకు అమలు చేస్తున్న రిజర్వేషన్లు తమకు కూడా వర్తింపచేయాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు.

మెయితీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న అంశాన్ని పరిశీలించేం దుకు కేంద్ర ఆదివాసీ శాఖకు ప్రతిపాదన చేయాలని ఆ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించడం తాజా గొడవలకు మూలకారణం. వాస్తవానికి మెయితీలకు, కుకీలు, నాగాలకు మధ్య చాలాకాలంగా వైరుధ్యా లు ఉన్నాయి. మెయితీలకు రిజర్వేషన్లు దక్కితే వారు అటవీ ప్రాంతాల్లో ఆవాసా లు ఏర్పర్చుకోవడంతో పాటుగా తమకు దక్కాల్సిన ఉద్యోగాలు,ప్రభుత్వ పథకాల్లో వాటా తగ్గిపోతుందనేది వారి ఆందోళన.

కోర్టు తీర్పు వెలువడగానే ఆ దిశగా రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు యత్నించడంతో కుకీల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు చేయడంతో పాటుగా మైతేయి తెగకు చెందిన వారిని కిడ్నాప్ చేయడం, హత్య చేయడం మొదల పెట్టా రు. మహిళలతో పాటుగా ఆరుగురికి కిడ్నాప్ చేసి హత్య చేయడంతో గత నవంబర్‌లో మరోసారి రాష్ట్రం భగ్గుమంది.

వీరి మృతదేహాలు నదిలో లభ్యం కావడంతో జిర్‌బామ్‌లో చెలరేగిన హింస రాష్ట్రమంతటికీ వ్యాపించింది. దీంతో అత్యవసరంగా సమావేశమైన కేంద్ర హోం శాఖ అల్లర్లను అదుపు చేయడానికి ఇప్పటికే ఉన్న కేంద్ర బలగాలకు తోడుగా అదనంగా మరో 50 బృందాలతో కూడిన 5 వేల బలగాలను రాష్ట్రానికి పంపించాలని నిర్ణయించింది. అయితే కేంద్రం చర్యలు శాంతిభద్రతలను అదుపు చేయడానికి ఉపయోగపడుతుందే తప్ప సమస్య పరిష్కారానికి ఏ విధంగా నూ తోడ్పడదని అప్పట్లోనే రాజకీయ పరిశీలకుల అభిప్రాయపడ్డారు.

అమిత్ షాకు నమ్మిన బంటు

ఇదే విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన కేంద్ర ప్రభుత్వం గతంలో కేంద్రంలో హోంశాఖ కార్యదర్శిగా పని చేసిన అజయ్ కుమార్ భల్లాను మణిపూర్ గవర్నర్‌గా నియమించింది. గత వారం పలు రాష్ట్రాల కు గవర్నర్లను నియమించడంలో భాగం గా భల్లాను మణిపూర్ గవర్నర్‌గా నియమించారు. అంతకుముందు మణిపూర్ గవర్నర్‌గా ఉన్న అనసూయ ఉయికే తప్పుకున్నప్పటినుంచి అస్సాం గవర్నర్‌గా ఉన్న లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. 

ఇప్పుడు భల్లాను రాష్ట్ర గవర్నర్‌గా నియమించడంతో రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్రం చర్యలు తీసుకోవడం మొదలైందనే భావన అందరిలో నూ కలుగుతోంది. ఎందుకంటే బ్యూరోక్రాట్ అయిన భల్లా గతంలో హోం శాఖ కార్యదర్శిగా ఎన్నోకీలక బాధ్యతలు విజయవంతంగా నిర్వహించారు. అంతేకాదు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అత్యంత విశ్వాసపాత్రుడు కూడా.

మరో వైపు రాష్ట్ర భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్ కూడా షా నమ్మిన బంటే. అంతే కాదు రాష్ట్రంలో శాంతిభద్రతలు చూస్తున్న యూనిఫైడ్ కమాండ్‌కు ఇన్‌చార్జి కూడా.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరయిన సమన్వయం ఉండడానికి ఇది తోడ్పడుతుందని విశ్లేషకుల అంచనా. అయితే శాంతిభద్రతలను కట్టడి చేయడం ఒక్కదానితో సమస్య పరిష్కారం కాదు.

ఇప్పటికే వేలాది మంది తమ ఇళ్లు వదిలిపెట్టి శరణార్థి శిబిరాల్లోనే తలదాచుకుంటున్నారు.అంతేకాదు రాష్ట్రం మైతేయీ, కుకీల మధ్య రెండుగా విడిపో యి ఉంది. ఈ రెండువర్గాల మధ్య సామరస్యాన్ని సాధించినప్పుడే సమస్య పరిష్కా రం అవుతుంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలోని వివిధ వర్గాలతో ఈ దిశగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

కేంద్రం గవర్నర్‌కు పూర్తి అండగా నిలబడి మైతేయీలు, కుకీల మధ్య అగాధాన్ని కొంతమేరకైనా తగ్గించేలా ఆయన చర్యలు తీసుకునేందుకు ప్రోత్సహించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఎన్ని విమ ర్శలు వచ్చినప్పటికీ బీరేంద్రసింగ్‌ను సీఎం పదవినుంచి తప్పించకుండా ఆయనను కాపాడుతూ వచ్చినప్పటికీ మోదీ సర్కార్ రాష్ట్రం విషయంలో ఆయనను పూర్తిగా నమ్మడం లేదనే సంకేతాలనయితే భల్లా నియామకం ద్వారా ఇచ్చింది.

 కె.రామకృష్ణ