calender_icon.png 13 August, 2025 | 9:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్యనిర్వహణ సాఫల్యానికి మార్గం

01-01-2025 12:00:00 AM

  • విభజ్యామాత్య విభవం 

దేశకాలౌచ కర్మచ అమాత్యాః 

సర్వ ఏవైతే కార్యాః 

స్యుర్నతు మంత్రిణః! 

 కౌటిలీయం (1-8)

చాణక్యుడు మంత్రి, అమాత్యుల భేదంతోపాటు వారి నియామకాలలో తీసుకోవలసిన జాగ్రత్తలనూ చెప్పాడు. సంస్థలో ముఖ్య కార్యనిర్వహణాధికారిని మంత్రిగానూ, అనునిత్యం నిర్వహించాల్సిన కార్యకలాపాలను పర్యవేక్షించే నిర్వాహకుని అమాత్యునిగానూ చెప్పాడు చాణక్య. అనునిత్య కార్యకలాపాలను పర్యవేక్షించే అధికారి, అతనికి సహాయపడే వివిధ విభాగాల నిర్వహణాధికారులు సంస్థ ప్రగతిలో ముఖ్యభూమిక ను నిర్వహిస్తారు.

వారి నియామకాలపట్ల చాలా జాగరూకతతో వ్యవహరించాలి. కాలావధిలో వారికి అవస రమైన శిక్షణనూ అందించాలి. అమాత్యుని లేదా పర్యవేక్షణాధికారిని, వారి సహాయకులను నియమించుకునే సమయంలో సహాధ్యాయులను నియమించుకుంటే సాధక బాధకాలు ఉంటాయని అంటాడు చాణక్య. 

నిర్వహణాధికారులుగా నియమితులయ్యే అభ్యర్థులకు ఆయా కార్యాలు నిర్వహించగలిగిన సామర్థ్యం ఉండాలి. నిజానికి ఒక వ్యక్తి తానెంత సమర్థుడైనా ప్రతి పనీ ఒక్కడే చేయలేడు. చేసినా ఒకే విధంగా చేయలేడు. ఒకరొక పని చేయగలిగితే మరొకరు మరొక పనిని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. అందువల్ల ఒక పనిని సాధించడానికి అవసరమైన సామర్థ్యాన్ని, అభ్యర్థికి స్వతస్సిద్ధంగా ఉండే సామర్థ్యాన్నీ రెంటినీ దృష్టిలో పెట్టుకొని, అతని గుణగణాలను అంచనా వేసి, సమర్థులను పర్యవేక్షణాధికారులుగా నియమించుకోవాలి.

సహాధ్యాయులను మంత్రులుగా మాత్రం నియమించకూడదని చెపుతున్నాడు చాణక్య. పర్యవేక్షణాధికారికి తన రంగంలో అనుభవం, సాంకేతిక విజ్ఞా నం, తెలివితేటలు, స్ఫురణ, మానసిక శారీరక ఆరో గ్యం, లోతుగా పరిశీలించి సమస్యలలో కీలకాంశాలను పట్టుకునే నేర్పరితనం, సామర్థ్యం ఉండాలి. సూక్ష్మదృష్టితో సమస్యలోని ఆంతర్యాన్ని పట్టుకోవాలే కాని పైపై న చూసి తాత్కాలిక పరిష్కారాన్ని సూచించకూడదు.

భావాన్ని ధైర్యంగా, ప్రభావవంతంగా, స్పష్టంగా చెప్పగలిగే విధానం తెలియాలి. సహచరులు తమ సమస్య లను పరిష్కరించుకునే సందర్బంలో సహాయకారిగా, సమయోచిత నిర్ణయాలను త్వరగా తీసుకునేందుకు ఉత్ప్రేరకంగా పనిచేయ గలగాలి. విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని పరిష్కరించుకునే మానసిక సన్నద్ధతను కలిగి ఉండాలి. ప్రలోభాలకు లొంగని దృఢమైన మనసు, నైతిక వర్తన, శీల సంపదలను కలిగి ఉండాలి. 

ఎన్ని సుగుణాలు ఉంటే అంత మంచిది!

నిర్వహణాధికారులకు ఉండాల్సిన లక్షణాలలో నేర్చుకునే జిజ్ఞాస ముఖ్యమైంది. పూర్వ నిశ్చితాభిప్రాయాలను పక్కన పెట్టి అధ్యయనం చేయడం, అవగాహన చేసుకోగలగడం. తెలుసుకున్న దానిని ఆచరణలో పెట్టి అనుభవ జ్ఞానాన్ని పొందాలి. ఇతరులు చెప్పే విషయాలను వారి కోణంలో అర్థం చేసుకుంటూ వినే నైపుణ్యం కలిగి ఉండాలి.

విషయాన్ని వివిధ కోణాలలో విశ్లేషణ చేసుకుంటూ వివరణాత్మకమైన ఆలో చనా స్ఫూర్తితో ప్రతిస్పందించాలే కాని తొందరపాటు పనికిరాదు. లోతుగా ఆలోచించడమే కాక దానిని వివి ధ దృష్టి కోణాల నుంచి విస్తృత పరిధిలో పరిశీలించి అవగాహన చేసుకునే సహనశీలత కూడా అవసరం. దృఢమైన, నిర్మొహమాటమైన వైఖరిని దూకుడు తత్త్వంగా పరిగణించకూడదు.

ఎక్కడ కాదని చెప్పాలో అక్కడ నిశ్చయంగా కాదనే చెప్పాలి. కాకపోతే వీలైనంత సౌమ్యంగా చెప్పగలగాలి. ముఖ్యంగా తప్పు జరిగిన వేళ పక్షపాత వైఖరితో వ్యవహరించకుండా సత్యాన్ని విచారించి సమస్యను పరిష్కరించే నైపుణ్యం, సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి.

ఇక్కడ అనుభవజ్ఞులైన ముందుతరం వారి మార్గదర్శన ఉపయుక్తమవుతుంది. ఇలాంటి అధికారులను నియమించుకున్న నాయకుడు బాధ్యతలను సహచరులకు అప్పగించి తన సమయాన్ని మరింత ప్రభావవంతంగా వినియోగించుకునే అవకాశాన్ని పొందుతాడు. 

 పాలకుర్తి రామమూర్తి