10 May, 2026 | 10:04 AM

మార్కెటింగ్ రంగంలో నూతన ఆవిష్కరణలు

25-04-2024 01:51 AM

హైదరాబాద్ రిటైల్ సమ్మిట్‌లో వక్తలు 

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఏప్రిల్ 24 (విజయక్రాంతి) : భవిష్యత్తులో మార్కెటింగ్ రంగంలో నూతన ఆవిష్కరణలకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని  రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఆర్‌ఏఐ) సీఈఓ కుమార్ రాజగోపాలన్ తెలిపారు. ఆర్‌ఏఐ ఆధ్వర్యంలో హైదరాబాద్ రిటైల్ సమ్మిట్ (హెచ్‌ఆర్‌ఎస్) మూడో ఎడిషన్‌ను హోటల్ ఐటీసీ కోహినూర్‌లో బుధవారం నిర్వహించారు. హైదరాబాద్‌లోని రిటైల్ మార్కెటింగ్ సమస్యల గురించి తెలుసుకోవడానికి, తోటి వ్యాపారులతో పరిచయం పెంచుకునేందుకు, వ్యాపార రంగంలో కొత్త ఆవిష్కరణల గురించి చర్చించుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశామని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్‌ఏఐ సీఈఓ కుమార్ రాజగోపాలన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజగోపాలన్ మాట్లాడుతూ..  హైదరాబాద్ నగరంలో ఐటీ రంగం విస్తరించడం శుభపరిణామమని తెలిపారు. అనంతరం జయేష్ రంజన్ మాట్లాడుతూ.. వ్యాపార రంగంలో నగరం మరింత అభివృద్ధి సాధించడానికి ప్రభుత్వ పరంగా అన్ని సదుపాయాలను కల్పిస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ రిటైల్ సమ్మిట్ చైర్మన్ అవ్నిష్ కుమార్ మాట్లాడుతూ.. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో నివసించే వినియోగ దారులకు అనుగుణంగా కొత్త మార్గాలను అన్వేషించడానికి ఈ సమ్మిట్ వేదికగా పనిచేస్తుందని అన్నారు. సమావేశంలో హైదరాబాద్‌కు చెందిన సుమారు 200 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.