పేదల జీవితాల్లో ‘ఇందిరమ్మ’తో కొత్త వెలుగులు
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
చిట్యాల, మార్చి 19 : ఇందిరమ్మ ఇండ్ల పథకం పేదల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుందని లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. గురువారం చిట్యాల మండలం పెద్దకాపర్తి, గుండ్రాంపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో కలెక్టర్, ఎమ్మెల్యే ముఖ్య అతిథులుగా హాజరైనారు.
ఏళ్ల తరబడి ఎదురుచూసిన పేదల సొంతింటి కలను నిజం చేస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రజలలో ఆనందపు వెలుగులు నింపుతోందని, పేదలకు గౌరవప్రదమైన జీవనం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణ కార్యక్రమం సామాజిక సమానత్వానికి, అభివృద్ధికి నిదర్శనమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సొంతింటి కళ నెరవేరుతున్న లబ్ధిదారుల ముఖాల్లో కనిపించిన ఆనందం ఈ పథకం విజయాన్ని స్పష్టంగా తెలియజేస్తోందన్నారు. అధికారుల సమన్వయంతో నాణ్యతతో కూడిన గృహాల నిర్మాణం పూర్తి చేయడం పట్ల కలెక్టర్ అధికారులను అభినందించారు.
పండుగ వాతావరణంలో నిర్వహించిన ఈ గృహప్రవేశాలు పేద ప్రజల్లో నూతన ఆశలు నింపగా, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో అశోక్ రెడ్డి, చిట్యాల ఇన్చార్జ్ తహశీల్దార్ విజయ , ఎంపీడీవో ఎస్ పి.జయలక్ష్మి వివిధ శాఖల ఉన్నతాధికారులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్, చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు కాటం వెంకటేశం, స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.




