10 May, 2026 | 5:06 AM

అభ్యర్థులకు కొత్త పరేషాన్!

25-04-2024 02:01 AM

l ప్రచారంలో సహకరించని కార్యకర్తలు

l సామాజిక వర్గం కోణంలోనూ వ్యతిరేకత

l పలువురు పార్టీ మారుతున్న వైనం

l వారిని దారికి తెచ్చుకునే ప్రయత్నాల్లో క్యాండిడేట్లు

l స్థానిక ఎన్నికల్లో టికెట్ల ఇస్తామని బుజ్జగింపు 

హైదరాబాద్, ఏప్రిల్ 2౪ (విజయక్రాంతి): రాష్ట్రంలో పార్లమెంటు పోరు నున్వానేనా అన్నట్లు సాగుతోంది. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే తమ పార్టీ మండల, గ్రామ, మున్సిపాలిటీ స్థాయి నాయకులతో సమావేశాలు నిర్వహించారు. ఈసారి జరిగే ఎన్నికల్లో నిబద్ధతతో పనిచేసి గెలుపునకు సహకరించాలని కోరారు. అయితే కొంతమంది వెనకడుగు వేస్తున్నవారిని తమదారిలోకి తెచ్చుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు ప్రారంభించారు.

ప్రచారం గడువు ముగిసేవరకు పార్టీ విజయం కోసం శ్రమిస్తే జూలై, ఆగస్టులో జరిగే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసేందుకు అవకాశం కల్పించి సరిపడా ఆర్థిక వనరులు సమకూర్చుతామని హామీలిస్తున్నారు. నామమాత్రంగా పార్టీలో ఉండి ఇతర పార్టీల అభ్యర్థుల సహకరించే వారిని గుర్తించి ప్రాధాన్యం తగ్గిస్తామని హెచ్చరిస్తున్నట్లు మండల స్థాయి నాయకులు తెలిపారు. కొంతమంది నాయకులు తమ కులానికి చెందిన వ్యక్తి ఎంపీగా పోటీ చేశారని, అతడు ఓడిపోతే తమ కుల రాజకీయ పెత్తనం చెల్లదని పేర్కొంటూ అడపాదడపా ప్రచారానికి వస్తున్నారని అభ్యర్థులకు ఫిర్యాదులు వచ్చాయి. కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో బీఆర్‌ఎస్, బీజేపీకి చెందిన రాజకీయ ఆశావాహులు సొంత పార్టీలో ఉంటూ అభ్యర్థులకు వెన్నుపోటు పొడుస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

అభ్య    ర్థులు మొదటి విడత ప్రచార సమయంలోనే చాలామంది నాయకులకు రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు నగదు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ప్రచారం ముగిసేవరకు ఇతర పనులకు దూరంగా ఉండి తమకు అప్పగించిన బాధ్యతలు సమర్థంగా నిర్వహించి బూత్‌లో సగానికి పైగా ఓట్లు పడేలా చూడాలని ఒప్పందాలు చేసుకున్నారు. కానీ వారంతా నగదు జేబులో వేసుకుని బూత్‌ల వారీగా ప్రచారం చేయకుండా ఇతర పార్టీల నాయకులతో చీకటి ఒప్పందాలు చేసుకుంటూ సొంత పార్టీ ఓటమికి తెరవెనక రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. దీనిని గమనించిన అభ్యర్థులు సీనియర్లను రంగంలోకి దించి ప్రచారం చేసేందుకు స్థానిక పదవులు ఆశ చూపి పార్టీకి దూరం కాకుండా కాపాడుకుంటున్నట్లు సమాచారం.

బీఆర్‌ఎస్‌లో స్థానిక నేతల పక్కచూపులు

ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసే అభ్యర్థులు స్థానిక నేతల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందడంలేదని మదనపడుతున్నారు. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మెదక్, జహీరాబాద్, భువనగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్లలో పోటీ చేసే నాయకులకు ఒక వర్గం నుంచి విచిత్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్, బీజేపీల నుంచి తమ సామాజిక వర్గానికి నేత పోటీ చేస్తున్నాడని ఆయనకు వ్యతిరేకంగా పనిచేయలేమని, ఈ ఒక్కసారి తమను వదిలేయాలని పేర్కొంటునట్లు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.