05-07-2025 02:03:02 PM
తెలంగాణ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ.ఖాద్రీ విజ్ఞప్తి.
కరీంనగర్,(విజయక్రాంతి): ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్లకు సంబంధించిన నూతన పీఆర్సీ (వేతన సవరణ)- 2023 తక్షణమే ప్రకటించి, ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు చేపట్టాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్(Telangana Employees Association) ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ.ఖాద్రీ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. జులై 1,2023 నుంచి ప్రకటించాల్సిన పీఆర్సీ రెండు సంవత్సరాల కాలం గడిచిన నేటికీ అతా పతా లేకుండా పోయిందని, గత పీఆర్సీ లో ఉద్యోగ ఉపాధ్యాయులు 12 నెలల బకాయిలు నష్టపోయారు. 21 నెలల బకాయిలు పదవీ విరమణ పొందిన అనంతరం ఇస్తామనడం, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒప్పుకోవడం జరిగిందన్నారు.
ఇప్పుడైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రెండవ పీఆర్సీ కోతలు లేకుండా కడుపు నిండా 2023 నుంచి అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. రోజులు గడిచేకొద్దీ ఉద్యోగులలో అభద్రతా భావం, ఆందోళనలకు గురి అవుతున్నారు. పెండింగ్ డీఏలు, సప్లిమెంటరీ బిల్లులు, సరెండర్, జీ పీ ఎఫ్ బిల్లులపై వెంటనే ప్రభుత్వం స్పందించి ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యలపైన తగు నిర్ణయాలు తీసుకోని అమలు చేయాలని అన్నారు. గత పీఆర్సీ అమలుకు 33 నెలల కాలం పట్టింది, ఆ పరిస్థితులు తిరిగి పునరావృతం కాకుండా వెంటనే నూతన వేతన సవరణ చేయాలని అన్నారు. ఆదేశాలు ఇచ్చి నూతన వేతన సవరణ కమీషన్ సిఫార్సులను తెప్పించి ఉత్తర్వుల ద్వారా 2023 నుంచి అమల్లోకి తీసుకు రావాలని కోరారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక ప్రయోజనాలపై ద్రుష్టి సారించి సగటు ఉద్యోగికి లాభం చేకూరేలా ప్రభుత్వం చూడాలని విజ్ఞప్తి చేశారు.