05-07-2025 02:06:46 PM
వనపర్తి టౌన్,: భారత దేశ వికాసం అనేది జిల్లాలు, రాష్ట్రాల వికాసం పైనే ఆధారపడి ఉంటుందని నీతి ఆయోగ్ ఉప కార్యదర్శి(NITI Aayog Deputy Secretary) న్యూఢిల్లీ అరవింద్ కుమార్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా ప్రజలకు తాగు,సాగు నీరు క్షేత్ర స్థాయిలో ఏ విధంగా అందుతుంది,వాటి నాణ్యత ప్రమాణాలు ఎలా వున్నాయి అనే విషయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇచ్చేందుకు న్యూఢిల్లీ నుండి కేంద్ర కమిటీ శనివారం వనపర్తి జిల్లాను సందర్శించింది. కేంద్ర ప్రభుత్వం(Central Government) నీతి ఆయోగ్ ద్వారా కమిటీ బృందాలను ఏర్పాటు చేసి దేశంలోని ఆయా రాష్ట్రాల్లో పర్యటించి జల్ జీవన్ మిషన్ అభియాన్ ఏ విధంగా అమలవుతుంది అనే విషయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవిక నివేదికను ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన బృందాలలో 28వ బృందం శనివారం వనపర్తి జిల్లాను సందర్శించింది.
ఈ బృందానికి నీతి ఆయోగ్ డిప్యూటీ సెక్రెటరీ అరవింద్ కుమార్ నాయకత్వం వహించగా డిప్యూటీ డైరెక్టర్ సెంట్రల్ వాటర్ కమిషన్ అరుణ్ కుమార్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ సైంటిస్ట్ పి. యాదయ్య సహాయకులుగా ఉన్నారు.కేంద్ర బృందానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కలెక్టరేట్ లో స్వాగతం పలికారు. అనంతరం సమావేశ మందిరంలో సమావేశం ఏర్పాటు చేసి వనపర్తి జిల్లాలో మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు అందిస్తున్న తాగు నీరు విధానం, అవాంతరాలను అధిగమించేందుకు చేపట్టిన చర్యల పై ప్రొజెక్టర్ ద్వారా,నివేదిక రూపంలో అందజేశారు.ఈ సందర్భంగా డిప్యూటీ సెక్రెటరీ అరవింద్ కుమార్ మాట్లాడుతూ 2047 లో భారత దేశాన్ని అన్ని రంగాల్లో వికసిత దేశంగా చూసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో ఏ విధంగా అమలు అవుతున్నాయి, ప్రజల జీవన ప్రమాణాలు ఏ విధంగా అభివృద్ధి అవుతున్నాయి అనే విషయాలను తెలుసుకొని నివేదిక ఇచ్చేందుకు వనపర్తి జిల్లాలో శని, ఆదివారం రెండు రోజులు పర్యటించనున్నట్లు తెలిపారు.
వనపర్తి జిల్లాలోని అచ్యుతాపుర్, ఖాసిం నగర్, కానాయపల్లి మంచినీటి శుద్ధి కేంద్రం, రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ 2 వ కెనాల్ ను సందర్శించి జిల్లా ప్రజలకు తాగు నీరు ఎలా ఇస్తున్నారు, నాణ్యత ప్రమాణాలు ఏవిధంగా ఉన్నాయి, సమస్యలు వస్తె ఏ విధంగా అధిగమిస్తున్నారు అనే విషయాలను తెలుసుకోడానికి రావడం జరిగిందన్నారు.జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో ఇంటింటికి శుద్ధమైన తాగు నీరు ఇవ్వడం జరుగుతుందని, ఓవర్ హెడ్ ట్యాంకులను నెలలో మూడుసార్లు శుభ్రం చేసేవిధంగా అక్కడే రిజిస్టరు పెట్టించడం జరిగిందన్నారు.
అదేవిధంగా వ్యవసాయానికి అత్యధికంగా సాగు నీరు ఇస్తున్నట్లు తెలిపారు.వర్షాల వల్ల చెరువులు కుంటలు నింపుకోవడమే కాకుండా పై నుంచి వచ్చే నదీ ప్రవాహం వల్ల రిజర్వాయర్లు,చెరువులు నింపుకోవడం జరుగుతోందన్నారు. భూగర్భ జలాలు పెంచేందుకు వాటర్ కన్సర్వేషన్,వాటర్ షెడ్, రూఫ్ టాప్ హార్వెస్టింగ్ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.వేసవి కాలంలో కొంత నీటి సమస్య ఏర్పడితే పరిష్కరించేందుకు బోరు బావులు సిద్ధంగా ఉంటాయని వివరించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి యాదయ్య, మిషన్ భగీరథ ఎస్. ఈ వెంకటరమణ, ఇరిగేషన్ ఎస్. ఐ శ్రీనివాస్ రెడ్డి, మిషన్ భగీరథ ఈ. ఈ మేఘా రెడ్డి, పి.డి. డిఆర్డీఓ ఉమాదేవి ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.