8 July, 2026 | 2:03 AM

ఆర్మూర్ మీదుగా పటాన్‌చెరు ఆదిలాబాద్ కొత్త రైల్వేలైన్ మంజూరు

24-09-2025 12:05 AM

ఎంపీ అర్వింద్‌కి లేఖ ద్వారా తెలియజేసిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

నిజామాబాద్, సెప్టెంబర్ 23 (విజయ క్రాంతి): నిజామాబాద్ లో రైల్వే సౌకర్యాల విస్తరణలో భాగంగా   మరో ప్రాజెక్ట్ కి ఎంపీ అరవింద్ కృషి వల్ల  ముందడుగు పడింది. గత రెండేళ్లుగా ఆర్మూర్ మీదుగా పటాన్ చెరు - ఆదిలాబాద్ మధ్య కొత్త రైల్వే లైన్ వేయాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ని పలుమార్లు కోరారు.

ఎంపీ అరవింద్ విజ్ఞప్తిని పరిశీలించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా ఈ  ప్రాజెక్టు మంజూరు అయ్యిందని ఎంపీ అర్వింద్ కు తెలియజేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి   డీపీఆర్ తయారు చేస్తున్నారని,

డీపీఆర్ పూర్తయిన తర్వాత  తదుపరి చర్యలు చేపడతామని అరవింద్ కు పంపిన లేఖలో మంత్రి పేర్కొన్నారు. కాగా తన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి, ఉత్తర తెలంగాణలో ముఖ్యమైన నూతన రైల్వే లైన్ మంజూరు చేసినందుకు ఎంపీ అర్వింద్, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కి ధన్యవాదాలు తెలియజేశారు.