బెడ్డూ లేదు.. రూం లేదు!
- ఇంటి స్థలాలకూ నోచుకొని వైనం
- ఒక్కో ఇంట్లో నాలుగైదు కుటుంబాలు
- వేల సంఖ్యలో ఆశావాహులు
- కనీస గూడు లేని నిర్భాగ్యులెందరో?
అశ్వారావుపేట, జూన్ 25 (విజయక్రాంతి) : కేసీఆర్ ప్రభుత్వంలో ఎంతో గొప్పగా చేపట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు అశ్వారావుపేట నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో పునాదులకే పరిమితమయ్యాయి. దశాబ్ద కాలం గా పేదలు పక్కా గృహాల కోసం ఎదురుచూస్తునే ఉన్నారు. ఇళ్లు మంజూరు కాలేదు సరికదా పేదలు నివసించటానికి కనీస గూడు కూడా లేక నానాఅవస్థలు పడుతున్నారు. చిన్న పాక వేసుకుని బతుకుదామంటే సెంటు భూమి కూడా లేదు. నియోజకవర్గంలోని ఏ ఒక్క గ్రామం లో కూడా దశాబ్ద కాలంగా ఒక్క సెంటు భూమి కూడా ప్రజలకు పంపిణీ చేసిన పాపానపోలేదు. ఒక్కో ఇంటిలో నాలుగైదు కుటుంబాలు నివసించాల్సిన దుస్థితి నెలకొంది. తెలంగాణ ఏర్పాడాక అప్పటి ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కదే అన్న చందంగా మారింది.
నిర్మాణాలు పూర్తి చేసినవి తక్కువే..
దశాబ్దకాలంలో అశ్వారావుపేట నియోజకవర్గం వ్యాప్తంగా 890 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరయ్యాయి. ప్రభుత్వమే స్థలం కేటాయించింది. ఇందు లో నిర్మాణాలు పూర్తి చేసుకున్నవి చాలా తక్కువే. మూడొంతుల నిర్మాణాలు వివిధ దశలలో నిలిచిపోయాయి. సంవత్సరాలు గుడుస్తున్నా ఒక్క ఇటుక కూడా పేర్చకపోవడంతో నిరుపేదల్లో నైరాశ్యం నెలకొంది. ఆ స్థలం అంతా పిచ్చిమొక్కలతో చిట్టడవిలా మారిపోయింది. కొన్నింటికి శ్లాబులు వేసినా అవి బీటలు వారిపోయాయి.
అశ్వారావుపేట మండలంలో మొదటి విడతలో 100 ఇళ్లు మంజూరయ్యాయి. ఆసుపాక, నందిపాడు, బచ్చువారిగూడెం, గోగులపూడి. నారంవారిగూడెంలో గృహ ప్రవేశాలు జరిగాయి. మరో 20 ఇళ్లు ప్రారంభం కాలేదు. రెండో విడతలో 200 ఇళ్లు.. పేరాయిగూడం, అచ్చుతాపురంలలో స్థలాలు చూపించలేదు. మద్దికొండలో కాంట్రాక్టర్ పనులు ప్రారంభించలేదు. అన్నపురెడ్డిపల్లి మండలంలో 60 ఇళ్లు.. నిర్మాణా లు పూర్తి అయ్యాయి. శాంతినగర్‌లో గృహ ప్రవేశాలు జరిగాయి. మిగిలిన ఇళ్లు పాడుబడిపోతున్నాయి. రెండో విడతలో మంజూరైన 20 ఇళ్లు ఇంకా ప్రారంభమే కాలేదు. చండ్రుగొండ మండలంలో మొదటి విడతలో 40 ఇళ్లు గృహ ప్రవేశాలు చేశారు. రెండవ విడతలో110 ఇళ్లు.. వివిధ దశల్లో నిలిచిపోయాయి.
ములకలపల్లి మండలంలో మొదటి విడతలో 60 ఇళ్లు.. ఒక్క ములకలపల్లిలో మాత్రమే పూర్తి అయ్యా యి. రెండో విడతలో 160 ఇళ్లు.. తిమ్మంపేట, గంగిరెడ్డిపల్లి, కంపగూడెంలో స్థలాల ఎంపిక పూర్తి కాలేదు. ముత్యాలంపాడు, కొత్త, పాత గంగారం, కమలాపురం, కొత్త జిన్నెలగూడెం గ్రామాలలో ఇంటి నిర్మాణాలు వివి దశలలో ఉన్నాయి. దమ్మపేట మండలంలో మొదటి విడతలో 120 ఇళ్లు మంజురై నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి. నేటికి లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాలేదు. రెండో విడతలో 120 ఇళు..్ల దమ్మపేటలో స్థలం కేటాయంచలేదు. మిగిలిన చోట్ల వివిధ దశల నిర్మాణాల్లో ఉన్నాయి.
కోట్ల రూపాయలు వృథా
అశ్వారావుపేట నియోజకవర్గంలో మంజూరైన 890 ఇళ్లలో కొన్ని నిర్మాణాలు పూర్తి చేసుకొని గృహ ప్రవేశాలు కానివి ఉన్నాయి. అవి ఇపుడు బీటల వారి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. వాటిని లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో నిర్మాణా లకు వెచ్చించిన కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అయిపోయింది. వాటిలో కొన్నింటికి స్వల్పంగా బిల్లులు అవ్వగా మరి కొన్ని నిర్మాణాలకు పైసా కూడా చెల్లింపులు కాలేదు. దీంతో ఆయా ఇళ్లను నిర్మిస్తున్న కాంట్రాక్టర్ లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి అప్పుల పాలైనట్లు చెబుతున్నారు. ఇప్ప టి ప్రభత్వమైనా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై దృష్టి సారించి పూర్తయిన గృహాలను లబ్ధిదారులకు అందజేయాలని కోరుతున్నారు.






