calender_icon.png 11 May, 2025 | 5:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

14న రామప్పలో పర్యాటకులకు నో ఎంట్రీ

10-05-2025 12:20:25 AM

కలెక్టర్ దివాకర టి.ఎస్

ములుగు,(విజయక్రాంతి): ప్రపంచ సుందరిమణులు ఈనెల 14న ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని  యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని సందర్శించడానికి వస్తున్న నేపథ్యంలో పర్యాటకులకు ఆరోజు అనుమతి లేదని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్పీ డాక్టర్ శబరిష్ తో కలిసి ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ 14వ తేదీ సాయంత్రం నాలుగు గంటల సమయంలో 30 నుంచి 35 మంది ప్రపంచ సుందరిమణులు రామప్ప దేవాలయాన్ని సందర్శించడానికి వస్తున్నారని చెప్పారు. దాదాపు మూడు గంటల పాటు రామప్పలో ప్రపంచ సుందరిమణులు ఉంటారని, భద్రత కారణాలవల్ల ఇతర పర్యాటకులను ఆరోజు రామప్ప దేవాలయానికి అనుమతించడం లేదని చెప్పారు. పాలంపేట ప్రధాన ద్వారం నుంచి మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఎవరికి అనుమతి ఉండదని తెలిపారు. ఐదు కిలోమీటర్ల మేర డ్రోన్ కెమెరాలను నిషేధించడం జరిగిందని, రామప్ప దేవాలయం లోపల పాత్రికేయులకు ఫోటోలు, వీడియోలు తీయడానికి అనుమతి లేదన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సెంటర్లోనే పాత్రికేయులకు అనుమతి ఉంటుందని, ఇతర ప్రదేశాల్లోకి వెళ్లడానికి ఏమాత్రం అవకాశం లేదని చెప్పారు. రామప్పను సందర్శించనున్న ప్రపంచ సుందరీమణులకు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను తెలిపే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, వారి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ వివరించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో డీపిఆర్ఓ రఫిక్ పాల్గొన్నారు.