calender_icon.png 1 September, 2025 | 12:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్తదానం... మన సామాజిక బాధ్యత

31-08-2025 06:57:29 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): సమాజంలో ప్రతి ఒక్కరు రక్తదానం, మన సామాజిక బాధ్యతగా భావించి, అత్యవసర పరిస్థితిలో రక్తదానం చేయాలని తుంగతుర్తి సామాజిక కార్యకర్త పోడేటి వంశీ గౌడ్ అన్నారు. మనిషి జీవితం రక్తంపైనే ఆధారపడి ఉంటుంది. రక్తం లేకపోతే ఒక్క క్షణం కూడా బతకలేం. రక్తానికి ఎలాంటి కర్మాగారం లేదు, ఎలాంటి ప్రత్యామ్నాయం లేదు. దానిని కేవలం మరొక మనిషి నుండి మాత్రమే పొందగలం. ప్రమాదాలు జరిగినప్పుడు ఆరోగ్యం క్షీణించినప్పుడు రక్తం ఆవశ్యకత రోగులకు ఎక్కువగా ఉంటుంది. ఒక రక్తపు బిందువే ప్రాణాన్ని నిలబెట్టగలదు.

రక్తదానం అంటే ప్రాణదానం - ఎవరి దగ్గర డబ్బు ఉన్నా, బంగారం ఉన్నా, రక్తం కొనలేడు. ఇది కేవలం మనిషి నుంచి మనిషికే అందే అమూల్యమైన వరం. రక్తం ఇచ్చినవాడు ఒకరికి మాత్రమే కాదు, ఒక కుటుంబానికి ఆనందం ఇస్తాడు. ప్రతి మానవ శరీరంలో రక్తం పెరుగుదలకు కావలసినటువంటి ఆహారాన్ని సమయానుకూలంగా సమకూర్చుకొని, ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరంలో రక్తం నిల్వ ఉంటుంది. చెడు వ్యసనాలకు బానిస కాకుండా, ప్రతి వ్యక్తి దైనందిన జీవితంలో సంపూర్ణమైన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి.

తలసీమియా, కాన్సర్, ప్రమాదాలు, ప్రసవ సమయంలో రక్తస్రావం ఇలా ఎన్నో పరిస్థితుల్లో రక్తం లేకపోతే ,ప్రాణాలు కాపాడలేం. కాబట్టి రక్తం అవసరమయ్యే వారు ఎప్పుడూ రక్తం విలువను గుర్తుంచుకోవాలి. రక్తదాతలను గౌరవించాలి. రక్తం యొక్క ఆవశ్యకతను యువతకు తెలియజేయాలి.రక్తం అంటే డబ్బుతో కొనలేని అమూల్యమైన ప్రాణవంతమైన వరం.. రక్తం ఇచ్చే చేయి అంటే ప్రాణాన్ని కాపాడే చేయి గా గుర్తుంచుకొని, సమాజంలోని ప్రజలకు అవసరమైనప్పుడు, ప్రతి వ్యక్తి తన బాధ్యతను తెలుసుకొని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందించుటకు కృషి చేయాలని ఆయన కోరారు.