డబ్బులతో ఆటలు వద్దు!
ఇంటర్నెట్‌లో చీకటి దారులకు కొదువలేదు. ఆ దారుల్లో ఆన్‌లైన్ గేమింగ్ ఒకటి. డబ్బులు పెట్టి ఆటల్లో తమ ప్రతిభ చూపాలనుకొనేవారు కొందరు.. క్రికెట్ లాంటి ఆటలపై పందాలు కాసేవాళ్లు మరి కొందరు. లాభం లేకుండా ఎవరూ వ్యాపారం చేయరని తెలిసినా గేమింగ్ అనే గ్యాంబ్లింగ్‌ను వ్యసనంగా మార్చుకొని కోట్లాది మంది డబ్బు పోగొట్టుకొంటున్నారు. ఆన్‌లైన్ గేమింగ్‌కు అలవాటు పడి, ఉన్న డబ్బు పోగొట్టుకొని.. అప్పులు చేసి, అవి తీర్చలేక వందల మంది ఆత్మహత్య చేసుకున్నారు.
ఆన్‌లైన్‌లో ఆటకోసం డబ్బులు లేక నేరాలకు పాల్పడినవారు కూడా ఉన్నారు. అక్రమ మార్గాల్లో సాగుతున్న ఈ ఆన్‌లైన్ గేమింగ్ దందాకు అడ్డుకట్ట వేసేందుకు 2017లోనే నిషేధం విధించింది. రమ్మీ, ఫాంటసీ స్పోర్ట్స్, పోకర్, ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌లపై తెలంగాణ కొరడా ఝుళిపించింది. ఇలాంటి ఆటలపై నిషేధం విధించిన మొదటి రాష్ట్రం తెలంగాణ. తర్వాత మరికొన్ని రాష్ట్రాలు కూడా ఆన్‌లైన్ గేమింగ్‌ను నిషేధించాయి.
దేశవ్యాప్తంగా దాదాపు 45 కోట్ల మంది ఆన్‌లైన్ గేమ్స్ ద్వారా డబ్బులు పోగొట్టుకున్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. వార్షిక నష్టం 20 వేల కోట్ల రూపాయల దాకా ఉంటుందని అంచనా. ఈ దందాను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు నడుం కట్టింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది.
ఆన్‌లైన్ గేమింగ్‌లో మంచివాటిని, ఈ ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటామని, డబ్బు లావాదేవీలు జరిగే ఆన్‌లైన్ గేమ్‌లను పూర్తిగా నిషేధిస్తున్నట్టు ఈ సందర్భంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఈ బిల్లు ప్రకారం అన్ని ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌తో పాటు ఆన్‌లైన్ ఫాంటసీ స్పోర్ట్స్, ఆన్‌లైన్ లాటరీ ఇకపై నిషేధం.
ఆన్‌లైన్ గేమ్‌లను ప్రమోట్ చేసిన వారు, ఆన్‌లైన్ గేమ్‌లకు సంబంధించి ఆర్థిక లావాదేవీలను నిర్వహించే బ్యాంకులు, సంస్థలు కూడా నేరస్థులగా పరిగణించనున్నారు. అదృష్టాన్ని పరీక్షించుకుందామని ప్రాణాల మీదకు తెచ్చుకునేలా డబ్బులు పెట్టి ఆన్‌లైన్ ఆటలకు యువతే ఎక్కువగా వ్యసనపరులయ్యారు. తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలు ఆన్‌లైన్ గేమింగ్‌ను నిషేధించినా, బెట్టింగ్ సైట్లు రూపం మార్చుకొని అందుబాటులోనే ఉన్నాయని వార్తలు వచ్చాయి.
ఆన్‌లైన్ గేమింగ్ చట్ట విరుద్ధమని తెలిసినా అలాంటి ఆటలు మానని వారున్నారు. విదేశాల నుంచి రకరకాల ప్లాట్‌ఫాంలపై డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి. మొబైల్ యాప్‌లపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో నిషేధం కంటితుడుపుగానే మిగులుతున్నది. ఆన్‌లైన్ గేమింగ్‌లో కోట్లాది రూపాయలు కొల్లగొట్టే సంస్థలకు అంతర్జాతీయంగా పెద్ద నెట్‌వర్క్ ఏర్పడింది.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు, హవాలాకు లెక్కలేనంత డబ్బు వాటి నుంచి వెళుతున్నట్టు అనుమానిస్తున్నారు. సినీ, క్రీడా ప్రముఖులను గేమింగ్ యాప్‌ల ప్రమోటర్లుగా మార్చారంటే ఆ వ్యాపారం ఎంతగా ఎదిగిందో అర్థం చేసుకోవచ్చు. డబ్బులతో జూదం ఆడినట్టుగా కాకుండా ప్రతిభను ప్రదర్శించే విధంగా ఆన్‌లైన్‌లో ఆటలు ఆడుకోవడాన్ని ఎవరూ కాదనరు. కానీ నిషేధించారని తెలిసినా ఆన్‌లైన్ గేమ్‌లు ఆడితే బాధితులుగా మిగిలిపోక తప్పదు.






