06-01-2026 01:28:13 AM
గోదావరిపై ఎన్ని ప్రాజెక్టులు కట్టినా ఎవరికీ ఇబ్బంది ఉండదు
తెలుగువారు ఐక్యంగా ఉండాలి.. తెలుగుజాతి ప్రపంచంలో నంబర్ వన్ కావాలి
ఏపీ సీఎం చంద్రబాబు
గుంటూరు, జనవరి 5(విజయక్రాంతి): తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషం కాదు సమైక్యత కోరుకుంటున్నానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గోదావరి నదిలో పుష్కలంగా నీరు ఉందని.. ఎన్ని ప్రాజెక్టులు కట్టినా ఎవరికీ ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలకు చంద్రబాబు సోమవారం హాజరై మాట్లాడారు. గోదావరి నదిలో పుష్కలంగా నీరు ఉందని.. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు సమయంలో ఫర్వాలేదని అనుకున్నామని వెల్లడించారు.
పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు మీద అభ్యంతరం తెలుపుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగువారంతా నీటి విషయంలో కలిసి ఉండాలని సూచించారు. గోదావరి నదిపై ఎన్ని ప్రాజెక్టులు కట్టినా ఎవరికీ ఇబ్బంది ఉండదని.. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాకుండా సమైక్యత ఉండాలని చంద్రబాబు సూచించారు.
ఏటా 3 వేల టీఎంసీల గోదారి నీరు సముద్రంలోకి
‘పోయిన సంవత్సరం సుమారుగా 6,282 టీఎంసీల నీరు.. సముద్రంలోకి వెళ్లిపోయాయి. గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. అందుకే గోదావరి నీళ్లు వాడుకునేందుకు నేను ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. రాష్ట్ర విభజన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు.. గోదావరి మీద ఎన్ని ప్రాజెక్టులకు కట్టినా ఫర్వాలేదు, మనకు నీళ్లొస్తాయని అనుకున్నాం. గత 40 సంవత్సరాలుగా 3 వేల టీఎంసీల నీరు గోదావరి నుంచి సముద్రంలోకి వెళ్లిపోతున్నాయి.
పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. కృష్ణా గోదావరి నదుల అనుసంధానం జరుగుతుందని చంద్రబాబు తెలిపారు. ‘తెలంగాణ వాళ్లు కూడా గోదావరి నీళ్లు వాడుకోవాలి. తెలుగు రాష్ట్రాలు ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి ముందుకుపోవాలి. నా జీవితాశయం ఒకటే.. తెలుగువారు ఐక్యంగా ఉండాలి. తెలుగు జాతి ప్రపంచంలో నంబర్ వన్ కావాలి’ అని చంద్రబాబు అన్నారు.