06-01-2026 12:58:06 AM
వాషింగ్టన్, జనవరి ౫ : ‘భారత ప్రధాని మోదీ చాలా మంచి వ్యక్తి. ప్రభావశీల నేత. చమురు కొనుగోళ్ల విషయం లో మోదీకి నా అసంతృప్తి గురించి తెలుసు’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ప్రయాణిస్తూ.. ఆయన మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. తమకు ఇష్టలేదని తెలిసి కూడా రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు చేసుకోవడంపై మరోసారి నిప్పులు చెరిగారు.
తనను సంతోషపెట్టడం మోదీకి ఎంతో ముఖ్యమని అభిప్రాయపడ్డారు. రష్యాతో భారత్ వాణిజ్య సంబంధాలను తాము గమనిస్తున్నామని పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌పై మరిన్ని సుంకాలు పెంచుతామని స్పష్టం చేశారు. ట్రంప్ గతంలో భారత్ నుంచి బియ్యం దిగుమతుల విషయంలోనూ భారత్‌పై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా, థాయ్‌లాండ్, భారత్ వంటి దేశాలు అమెరికాలో బియ్యాన్ని డంపింగ్ చేస్తున్నాయని మండిపడ్డారు.
అవసరమైతే భారత్ నుంచి దిగుమతయ్యే బియ్యం పైనా సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు మరువకముందే మరోసారి సుంకాల ప్రస్తావన తీసుకురావడం గమనార్హం. రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో భారత్‌పై అమెరికా గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. అమెరికా ఇదే కారణంతో గతేడాది భారత్‌పై అదనంగా ౨౫%సుంకాలు విధించిన సంగతీ విదితమే.
ఆ నిర్ణయంతో అమెరికా మన దేశంలపై విధించిన మొత్తం సుంకాల శాతం ౫౦కి చేరుకున్నది. అమెరికా తీరుపై గతంలోనే భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది. అమెరికా కూడా రష్యా నుంచి చమురు, యురేనియం వంటి ఖనిజాలను కొనుగోలు చేస్తోందని గుర్తుచేసింది. తామే చమురు కొనుగోలు చేస్తూ ఇతర దేశాలపై ఆంక్షలు విధించడం ఏంటని భారత్ ప్రశ్నించింది.