27-01-2026 09:18:00 PM
ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రాంగణంలో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు
ఆర్మూర్,(విజయక్రాంతి): ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం బుధవారం నుంచి ప్రారంభం కానుంది. మున్సిపల్ ఎన్నికల అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆర్మూర్ మున్సిపల్ కమీషనర్ ఉమామహేశ్వర్‌రావు ఆధ్వర్యంలో నామినేషన్లు స్వీకరించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. 36 వార్డుల నుంచి కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్లు స్వీకరించడానికి ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు.
బుధవారం నుంచి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగనుంది. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల స్వీకరణకు ఆరు కౌంటర్లను ఏర్పాటు చేసారు. ప్రతీ కౌంటర్‌కు ఒక అసిస్టెంట్ ఎన్నికల అధికారి బాధ్యుడిగా వ్యవహరిస్తాడు. ప్రతీ కౌంటర్ వద్ద మూడు వార్డుల అభ్యర్థుల నుంచి నామినేషన్లు తీసుకునే విధంగా ఏర్పాటు చేసారు. కౌన్సిలర్‌గా పోటీ చేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థితో పాటు అతని అభ్యర్థిత్వాన్ని బలపరిచే ఇద్దరు సభ్యులను మాత్రమే నామినేషన్ సమర్పించడానికి కార్యాలయం లోనికి అనుమతినిస్తారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ. 1,250, ఇతరులు రూ. 2,500 నామినేషన్ డిపాజిట్ కింద చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ మొత్తం నగదు రూపంలో గాని, డీడీ, చెక్ రూపంలోగాని చెల్లించవచ్చును. నామినేషన్ల స్వీకరణకు ఏర్పాటు చేసిన కార్యాలయం వెలుపల పోలీసు బందోబస్తుతో పాటు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన వారిపై కేసులు నమోదు చేయడానికి వీలుగా నామినేషన్ స్వీకరణ కేంద్రంలో వీడియో షూటింగ్‌కు సైతం ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలో 63,972 మంది ఓటర్లు ఉండగా 36 వార్డుల్లో 106 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసారు.
ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఒక ప్రొసీడింగ్ ఆఫీసర్‌తోపాటు నలుగురు పోలింగ్ స్టాఫ్ అందుబాటులో ఉంటారు. ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ నిర్వహించడానికి ఎన్నికల సిబ్బందిని సైతం ఎంపిక చేసి విధులు కేటాయించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ప్రత్యేక అధికారి, జాయింట్ కలెక్టర్ అంకిత్, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్నాన్ మాల్వియా ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.
ఏర్పాట్లు పూర్తి చేశాం: ఆర్మూర్ మున్సిపల్ కమీషనర్, ఎన్నికల అధికారి ఉమామహేశ్వర్‌రావు
ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం బుధవారం నుంచి ప్రారంభం కానుండటంతో నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాము. ఎన్నికల నియమావళికి అనుగుణంగా అభ్యర్థులు శాంతియుత వాతావరణంలో నామినేషన్లు సమర్పించాలి. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన వారిపై కేసులు తప్పవు. పోటీలో నిలిచే అభ్యర్థులు ఎన్నికల ప్రచారం కోసం నియమావళిని అనుసరించి ఖర్చు చేసుకోవచ్చును.