08-08-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, ఆగస్టు 7: ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ గురువారం నుంచి ఆరంభం అయింది. ఈ నెల 21వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉంది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. 17వ ఉపరాష్ట్రపతి పదవి కోసం ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.
జగదీప్ ధన్‌ఖడ్ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యం అయింది. 22న నామినేషన్లను తనిఖీ చేయనున్నారు. విత్ డ్రా కోసం 25 వరకు అవకాశం కల్పించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో లోక్ సభ, రాజ్యసభ సభ్యులు పాల్గొంటారు.
కూటమి అభ్యర్థి ఖరారు?
ఎన్డీయే కూటమి తరఫున ఉపరాష్ట్రపతి పదవికి పోటీపడే అభ్యర్థి ఖరారు అయినట్టు తెలుస్తోంది. రాజధాని ఢిల్లీలో గురువారం జరిగిన ఎన్డీయే నేతల సమావేశంలో ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు నడ్డా అభ్యర్థిని ఎంపిక చేసినట్టు సమాచారం. ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో 788 మంది ఎంపీలున్నారు. వారిలో ఎన్డీయే కూటమి ఎంపీలే అధికంగా ఉన్నారు. ఎన్డీయే, ఇండి కూటమి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిని నిలబెట్టాలని చూస్తున్నాయి.