calender_icon.png 22 October, 2025 | 1:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానికంగా 50 శాతం మించొద్దు

22-10-2025 01:31:12 AM

-ఎన్నికలపై ఎస్‌ఈసీని కోరిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్

-బీసీలకు 42 శాతం ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం 

-కానీ రిజర్వేషన్ల జగడం ఇప్పట్లో తేలేటట్లు లేదు

-ఎఫ్‌జీజీ ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాంతి) : సుప్రీంకోర్టు చెప్పినట్లుగా 50 శాతం రిజర్వేషన్లు మించకుండా స్థానిక సంస్థలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ ఎం.పద్మనాభరెడ్డి రాష్ర్ట ఎన్నికల సంఘాన్ని కోరారు.  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించడాన్ని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ స్వాగతిస్తుందని, అయితే ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లుగా పంచాయతీ ఎన్నికలకు 42 శాతం రిజర్వేషన్ల సమస్య అడ్డంకిగా మారిందన్నారు.

ప్రభుత్వం ఇచ్చిన జీవో 9 న్యాయ పరీక్షలో నిలువలేదన్నారు. దీంతో రిజర్వేషన్ల జగడం ఇంతలో తేలే సూచనలు కనపించడం లేదని, ఈ వ్యవహారం తేలే వరకు ఎన్నికలు జరుపకపోవడంటే పంచాయతీలను నిర్వీర్యం చేసినట్లేంటూ పద్మనాభ రెడ్డి  మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి అక్కర్లేదని పద్మనాభరెడ్డి స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం అనుకరణ 243 (కె) ప్రకారం రాష్ర్ట ఎన్నికల కమిషన్‌కు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపడానికి విస్తృతమైన అధికారాలు కల్పించిందని తెలిపారు.

ముఖ్యంగా ఓటరు లిస్టు తయారీ, ఎన్నికల నిర్వహణ బాధ్యత పూర్తిగా రాష్ర్ట ఎన్నికల సంఘానికి కట్టబెట్టిందని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల సంఘానికి ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ నుంచి ఎటువంటి అడ్డంకులూ లేకుండా ఉండే విధంగా రాష్ర్ట ఎన్నికల సంఘానికి విశేషమైన అధికారులు కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలకు 42 శాతం బీసీ రిజర్వేషన్లతో పంచాయతీ ఎన్నికలు ముడిపెట్టడంతో సమస్య మొదలైందని చెప్పారు. ఈ 42శాతం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు, సుప్రీంకోర్టు తాజాగా వెల్లడించిన తీర్పు ప్రకారం ఇప్పటికే అమల్లో ఉన్న రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని కోర్టులు స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయినప్పటికీ రాష్ర్ట ఎన్నికల సంఘం రాజ్యాంగం కల్పించిన అధికారాలు వినియోగించుకోకుండా ప్రభుత్వములో ఒక శాఖగా పనిచేస్తుందని పద్మనాభరెడ్డి ఆరోపించారు.