10-05-2025 12:13:18 AM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, మే 9 (విజయక్రాంతి) : అనుమతులు లేకుండా ఇళ్ల నిర్మాణాలు చేసిన వారికి నోటీసులు జారి చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి లే అవుట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రాఫ్ట్ లే అవుట్ ఆమోదం పొంది ఫైనల్ లే అవుట్ ఆమోదం కొరకు వచ్చిన దరఖాస్తులను కమిటీ సభ్యులు పరిశీలించారు.
లే అవుట్ లలో నిబంధనలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించిన (2) లేఅవుట్లను కమిటీ షరతులతో కూడిన ఆమోదం తెలిపింది. మౌలిక సదుపాయాలు అసంపూర్తిగా ఉన్న వాటిని కమిటీ పక్కకు పెట్టడం జరిగింది. ఈరోజు కమిటీ ముందుకు మొత్తం (7) లేఅవుట్లు కమిటీ ముందుకు వచ్చాయి. నిబంధనల ప్రకారం అన్ని మౌలిక వసతులు ఉంటేనే కమిటీ ద్వారా ఆమోదం పొందుతుందని తెలిపారు.
లే అవుట్ ఆన్లైన్ లో దరఖాస్తు కాగానే సంబంధిత రోడ్లు భవనాల శాఖ, ఇరిగేషన్, మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో వెళ్లి పరిశీలించాలని ఆదేశించారు. ప్రతి శాఖకు చెక్ లిస్ట్ ఉంటుందని, చెక్ లిస్ట్ ప్రకారం చూసుకొని అన్ని నిబంధనలు సరిగ్గా ఉంటే జిల్లా కమిటీకి సిఫారసు చేయాలని ఆదేశించారు.
అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి యాదయ్య, ఇరిగేషన్ ఇంజనీర్లు, డి. ఈ ఆర్ అండ్ బి, మున్సిపల్ కమిషనర్లు, టి. పి. ఒ లు, లే అవుట్ యజమానులు, ప్లానర్ లు తదితరులు పాల్గొన్నారు.