08-10-2025 08:07:28 PM
హైదరాబాద్: తెలంగాణలో నిర్వహించే తొలి విడత స్థానిక సంస్థ ఎన్నికల ప్రక్రియ గురువారం ప్రారంభం కానుంది. తొలి విడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారులు రేపు నోటీసులు జారీ చేయనున్నారు. ఐదు దశల్లో జరిగే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన తొలి విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ రేపు ఉదయం 10.30 గంటల నుంచి ఈనెల 11వ తేదీ వరకు జరుగుతుంది. మొదటి విడతలో 292 జడ్పీటీసీ, 2,963 ఎంపీటీసీల స్థానాలకు, ఇక రెండో విడత అక్టోబర్ 13 నుంచి 15 వరకు 273 జడ్పీటీసీ, 2,786 ఎంపీటీసీల స్థానలకు నామినేషన్ల స్వీకరణ, సర్పంచి, వార్డు స్థానాల ఎన్నికలకు ఈనెల 17న నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి కుముదిని ప్రకటించిన విషయం తెలిసిందే.
గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలుంటే అనర్హత వేటు నిబంధన ఈ ఎన్నికల్లోనూ అమలు కానుంది. ఈ నిబంధనను తొలగించేందుకు పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదనలు సమర్పించింది. జనాభా రేటుపై శాస్త్రీయ సమాచారం లేదని కారణంగా ప్రభుత్వం తొలుత తిరస్కరించింది. ముగ్గురు పిల్లల చట్టాన్ని శాసన సభలో సవరించాల్సి ఉన్నందున సమయాభావం లేకపోవడంతో జరపలేదు. దీంతో ఈ ఎన్నికలకు ముగ్గురు పిల్లలున్నవారు పోటీకి అనర్హులని అధికారులు ప్రకటించారు.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్
మొదటి విడత (292) జడ్పీటీసీ, (2,963) ఎంపీటీసీ ఎన్నికలు
నామినేషన్ల స్వీకరణ : అక్టోబర్ 09 నుంచి అక్టోబర్ 11 వరకు
నామినేషన్ల పరిశీలన : అక్టోబర్ 12
నామినేషన్ల ఉపసంహరణ : అక్టోబర్ 15
రెండో విడత (273) జడ్పీటీసీ, (2,786) ఎంపీటీసీ ఎన్నికలు
నామినేషన్ల స్వీకరణ : అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 15 వరకు
నామినేషన్ల పరిశీలన : అక్టోబర్ 16
నామినేషన్ల ఉపసంహరణ : అక్టోబర్ 19
ఓటర్ల వివరాలు:
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఓటర్లు :1,67,03,168
పురుషులు : 81,65,894
మహిళలు : 85,36,770
ఇతరులు : 504