08-10-2025 10:17:02 PM
ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు నోటిఫికేషన్
నల్గొండ టౌన్: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈనెల 9న మొదటి విడత జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదినికి తెలియజేశారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా గురువారం జారీ చేయనున్న మొదటి విడత జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
నల్గొండ జిల్లాకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ తెలియజేస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మొదటి విడతన 18 జెడ్పిటిసిలు, 196 ఎంపీటీసీల స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇందుకు సంబంధించి ఆర్ఓ, ఏఆర్ఓ, ఎంపీడీవోలకు శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగిందని, జిల్లా ఎస్పీతో కలిసి నామినేషన్ కేంద్రాల ను పరిశీలించడం జరిగిందని, నామినేషన్ కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నామని, నామినేషన్ల స్వీకరణ సందర్భంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జెడ్పీ సిఈఓ శ్రీనివాస్ రావు, డిపిఓ వెంకయ్య, తదితరులు పాల్గొన్నారు.