calender_icon.png 10 May, 2025 | 10:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యూసెన్స్ పబ్స్!

14-03-2025 01:01:06 AM

  1. చెవులు పేలే శబ్దంతో డీజే సౌండ్స్ 
  2. అరుపులు.. కేకలు అదనం
  3. తప్పతాగి రోడ్డుపైకి వచ్చి విన్యాసాలు 
  4. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-45లో ఇవి నిత్యకృత్యం

హైదరాబాద్, మార్చి 13 (విజయక్రాంతి): అది జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-45. ఈ ప్రాంతంలో మొత్తం పది పబ్స్.. అక్కడ పగలంతా ఒక లెక్క.. రాత్రైతే ఒక లెక్క.. 9 గంటలు దాటితే చాలు.. ఒకటే డీజే సౌండ్.. నిబంధనల ప్రకారం పబ్స్‌లో 60 డెసిబల్స్‌కు మించి సౌండ్ పెట్టకూడదు. కానీ.. నిర్వాహకులు యూత్‌ను ఉద్రేక పరిచేందుకు ఎక్కువ మోతాదులో డీజే సౌండ్ పెడుతుంటారు.

గంటల కొద్దీ డీజే సౌండ్ వినడమే కష్టమంటే.. ఇక యువతీ యువకుల అరుపులు భరించలేం. రాత్రి 12 గంట లు దాటిందని, పబ్ మూసేస్తారని.. శబ్దాలు ఉండవని భావిస్తే పొరపాటే. ఇక అప్పుడే మొదలవుతుంది మరో టార్చర్. ఫుల్‌గా మద్యం తాగి పబ్ బయటకు వచ్చిన వారంతా రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. కొందరు గ్యాంగ్‌వార్స్‌కు పాల్పడు తుంటారు. మరికొందరు ర్యాష్‌గా బైక్ నడుపుకొంటూ విన్యాసాలు చేస్తుంటారు.

రోడ్ల పైకి కార్లలో పెద్ద సౌండ్‌తో పాటలు పెడుతుంటారు. రోడ్డు పక్కన కార్ ఆపి స్టెప్పులు వేస్తుంటారు. ఇక వీకెండ్స్ అయితే మాటల్లో చెప్పలేం. తప్ప తాగి హ్యాంగోవర్‌లో ఉన్నవారితో స్థానికులు గొడవ పెట్టుకోలేరు. ఒకవేళ ఎదురెళ్లిన వారి పరిస్థితి చివరికి ఏమవుతుందో వేరే చెప్పాలా..? ఇప్పటికే కొందరు అలా దెబ్బతిని కూడా ఉన్నారు. 

ట్రాఫిక్ ట్రబుల్స్..

పబ్‌ల కారణంగా రాత్రిళ్లు జూబ్లీహిల్స్- 45లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. శుక్ర, శని, ఆదివారాల్లోనైతే ఈ తీవ్రత మరీ ఎక్కువగా ఉంటున్నది. వాహనదారులకు  పబ్ నిర్వాహకులే పార్కింగ్ సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది. కానీ.. నిర్వాహకులు నామమాత్రంగా పార్కింగ్ స్థలాలు కేటాయిస్తున్నారు.

దీంతో పార్కింగ్ స్థలం నిండిన తర్వాత వాహనదారులు ఎక్కడ ఖాళీ కనపడితే అక్కడ పార్క్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు ఎంతోమంది ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు నిత్యం ఈ మార్గం నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. అయినప్పటికీ.. సమస్యకు పరిష్కారం లభించడం లేదు. ఒక ప్రాంతంలో పరిస్థితులే ఇలా ఉంటే..

ఇక బంజారాహిల్స్, కొండాపూర్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో మరో 150 వరకు పబ్స్ ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లోనూ పరిస్థితులు దాదాపు ఇలాగే ఉన్నాయి. పబ్స్ విషయంలో ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేస్తున్నప్పటికీ నిర్వాహకులు మాత్రం ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. 

నిత్యం ఎక్సైజ్, పోలీస్ దాడులు..

పోలీస్, ఎక్సైజ్, టీజీ న్యాబ్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గత ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో సిబ్బంది పబ్స్‌లో ఆకస్మిక దాడులు నిర్వహించారు.  పబ్స్‌లో ఉన్న వారికి డ్రగ్స్ డిటెక్షన్ పరీక్షలు నిర్వహించగా, వారిలో పలువురికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దాడుల సమయంలో సిబ్బంది డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలను గుర్తించేందుకు స్నిఫర్ డాగ్స్‌ను ఉపయోగించిన సందర్భాలూ ఉన్నాయి.

జనవరిలో మియాపూర్‌లోని ఓ పబ్‌లోకి నిర్వాహకులు చిన్నారిని అనుమతించారు.  గత నెలలో గచ్చిబౌలి ప్రిజం పబ్‌కు మోస్ట్ వాంటెడ్ ప్రభాకర్ అనే నిందితుడు వచ్చాడనే సమాచారంతో పోలీసులు అక్కడి చేరుకున్నారు. అది గమనించిన నిందితుడు కాల్పులు సైతం జరిపాడు. గతేడాది అక్టోబర్‌లో బంజారాహిల్స్‌లోని టాస్ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడులు నిర్వహించారు.

నిర్వాహకులు యువతులతో అసభ్యకరంగా నృత్యం చేస్తున్నట్లు గుర్తించారు. దాదాపు 140మందిని అరెస్ట్ చేశారు. ఇదే ఏడాది ఆగస్టులో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 25 పబ్స్‌ల్లో దాడులు చేసి, ఆరుగురు డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు.