24-08-2025 01:35:47 AM
* పేదలకు ఇచ్చే ఇండ్లలో కూడా అవినీతి తిమింగలాలు చొరబడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో రాజకీయ దళారులు మోపయ్యారు. నిరుపేదలకు సొంతింటిని ఆశ చూపి లక్షల రూపాయలు దండుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పేదల దగ్గర స్వయంగా రాజకీయ నాయకులు లక్షలు పోగు చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
అధికార పార్టీ అనే కాదు.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన స్థానిక నాయకులు కూడా చేతివాటం చూపుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో నిజమైన అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కలగా మారే పరిస్థితి దాపురించింది. -మహబూబ్‌నగర్ జిల్లాలో మొదటి విడుతగా వచ్చిన రూ. లక్ష బిల్లులో దళారులు ౫ వేల రూపాయలు వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సంగారెడ్డి/మహబూబ్‌నగర్, ఆగస్టు 23 (విజయక్రాంతి): మెదక్ జిల్లాలో 9,091 ఇండ్లు మంజూరు కాగా, సంగారెడ్డి జిల్లాలో 14,529 ఇండ్లు, సిద్దిపేట జిల్లాలో 15,395 ఇండ్లు మంజూరు కాగా మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 39,015 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. అయితే కాంగ్రెస్ నాయకులతో పాటు బీఆర్‌ఎస్ నేతలు సైతం ఇందిరమ్మ ఇంటికి రూ.లక్ష చొప్పున వసూలు చేస్తున్నట్లు ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
పేదలకు ఇవ్వాల్సిన ఇందిరమ్మ ఇండ్లు.. ఇల్లు ఉన్న వారికి స్థానిక పార్టీ నాయకులకు కేటాయిస్తూ నిజమైన అర్హులకు మొండిచేయి చూపిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు కావాలంటే.. కాంగ్రెస్ కార్యకర్త అయినా అయిఉండాలి లేదా డబ్బులైనా ముట్టజెప్పాలి. నిజమైన అర్హులకు మాత్రం ఇందిరమ్మ ఇండ్లు దక్కడం లేదనేది వాస్తవం. పెద్ద నాయకులు రూ. లక్ష వసూలు చేస్తే గ్రామాల్లోని చిన్న నాయకులు రూ. 30వేలు దండుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది.
తెలంగాణ ప్రభుత్వం గూడు నీడ లేని పేదలకు సొంత ఇంటిని కట్టి ఇవ్వాలని నిర్ణయించింది. బలహీన వర్గాలకు అండగా నిలవాలనే కృత నిశ్చయంతో అర్హుల జాబితాను ప్రకటించి, ఆయా లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను సైతం అందించింది. దీంతో పలువురు అర్హులు ఇంటి నిర్మాణం కోసం ము గ్గులు పోసుకుని పనులు కూడా ప్రారంభించారు. స్థానిక కాంగ్రెస్ నేతలు ఇందిర మ్మ ఇండ్ల పేరు చెప్పి రూ. లక్షలు మూటగట్టుకుంటున్నారనే విమర్శలు వెలువెత్తుతు న్నా యి.
అటు అధికారుల పాత్ర కూడా కొంత ఉందనే వాదన వినిపిస్తోంది. ఈ నగదు ఆశించిన వారిలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీ నుంచి మొదలు పెడితే అధికారుల వరకు పాత్ర ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలకు తలూపుతున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కానీ.. స్థానిక ప్రజా ప్రతినిధులు కానీ ఈ అవినీతి తిమింగలాలు, ఈ దళారులపై దృష్టి సారించకపోతే భవిష్యత్తులో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ప్రజలు చెబుతున్నారు.
ఇడ్ల కోసం ఎదురుచూపులు
కరీంనగర్, ఆగస్టు 2౩ (విజయ క్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక, నిర్మాణ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంటే.. కరీంనగర్ నియోజకవర్గంలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. లబ్ధిదారుల జాబితాను ఇందిరమ్మ కమిటీలు ఆమోదించాల్సి ఉండగా ఇప్పటివరకు కరీంనగర్ నియోజకవర్గంలో కమిటీలే లేకపోవడం గమనార్హం. గతంలో నియోజకవర్గం నుంచి ఒక్కో గ్రామం, డివిజన్ నుంచి రెండేసి ఇందిరమ్మ కమిటీ సభ్యుల పేర్లను ఇన్‌చార్జి మంత్రి వద్దకు చేరినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఉంది.
కమిటీలు ఫైనల్ కాకపోవడంతో నియోజకవ ర్గంలో అర్హులైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. అన్ని నియోజకవర్గాల్లో ఇండ్లు కట్టుకుంటుంటే.. కరీంనగర్ పేదలకు మాత్రం ఎదురుచూపులు తప్పడం లేదు. కరీంనగర్ సిటీతోపాటు ఇతర మండలాల్లో ఇందిరమ్మ కమిటీలు లేని కారణంగా ప్రభుత్వం మంజూరు చేసిన 3,270 ఇండ్లకు ఇంకా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తికాలేదు.
ఇందులో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 1,737 ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఇందిరమ్మ ఇళ్ల కోసం 40,773 దరఖాస్తులు రాగా.. ఇందులో స్థలం ఉండి ఇల్లు లేనివాళ్లు(ఎల్1) 2,304 మంది ఉన్నారు.
స్థలం, ఇల్లు రెండూ లేని కుటుంబాలు (ఎల్ 2) 25,978 ఉన్నాయి. ఈ కుటుంబాలు అద్దె ఇళ్లలో నివాసముంటున్నారు. ఇల్లు ఉన్నప్పటికీ దరఖాస్తు చేసుకున్నవారిని అనర్హులుగా గుర్తించారు. ఇలాంటి దరఖాస్తులు 12,491 వచ్చాయి. వీరంతా ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురుచూస్తున్నారు.
కరీంనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయలోపం, ఆధిపత్య పోరుతోనే ఇందిరమ్మ కమిటీలు కొలిక్కి రావడం లేదు. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా పని చేసిన సమయంలో పురుమల్ల శ్రీనివాస్ ఇందిరమ్మ కమిటీల సభ్యుల జాబితాను అప్పటి జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సిటీలోని 6 డివిజన్లకు సంబం ధించిన ఇందిరమ్మ కమిటీల జాబితాను ఇన్‌చార్జి మంత్రికి పంపారు.
శ్రీనివాస్ పార్టీ నుంచి సస్పెండ్ కావడం, మరోవైపు ఇందిరమ్మ కమిటీల జాబితాలపై అభ్యంతరాలు ఉండటం, మంత్రుల అనుచరరుల ఆదిపత్య పోరు తో రెండు జాబితాల్లో దేనికి మంత్రి ఉత్తమ్ ఆమోద ముద్ర వేయలేదు. ఇటీవల జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నియమితులైన తుమ్మల నాగేశ్వర్రావు ప్రత్యేక దృష్టి సారిం చి కరీంనగర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ కమిటీలు ఫైనల్ చేసిన అర్హులకు ఇండ్లు వచ్చేలా చూడాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.
మొదటి బిల్లుకు రూ. 5 వేలు వసూలు
మహబూబ్‌నగర్ జిల్లాలో బేస్‌మెంట్ స్థాయిలో పూర్తయిన ఇండ్లకు మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలను లబ్ధిదారుల ఖాతాలో జమచేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తున్నా.. స్థానిక నాయకులు, కొందరు అధికారులు మాత్రం లబ్ధిదారుల వద్ద పలు సాకులు చెబుతూ ఎంతో కొంత మొత్తం రాబడుతున్నారు. ప్రతి ఇంటికీ రూ 5000 వసూలు చేస్తున్నట్లు గ్రామాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే లబ్ధిదారులు మాత్రం ఎక్కడా కూడా బహిరంగంగా డబ్బులు ఇస్తున్నట్లు చెప్పడం లేదు. ఇందుకు కారణం.. స్థానిక నాయకులు వారిని బెదిరిస్తున్నట్లు సమాచారం. ఇడ్ల మంజూరు చేయించామని, నిధులు కూడా త్వరగా మంజూరు చేయిస్తామని, ఇబ్బందులుంటే మేము చూసుకుంటామని దళారులు మాయమాటలు చెబుతూ లబ్ధిదారుల నుంచి డబ్బులు రాబడుతున్నారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లలో ఎక్కడా కూడా అవినీతి జరగకుండా లబ్ధిదారులకు మేలు చేస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా ఉన్నది.
బిల్లులు ఆలస్యం..
ఇంటి నిర్మాణ స్థలానికి డబుల్ రిజిస్ట్రేషన్‌ల సమస్య
అదిలాబాద్, ఆగస్టు 23 ( విజయక్రాంతి ): ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి బిల్లుల మంజూరు ఆలస్యంతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. జి ల్లా వ్యాప్తంగా 9093 ఇండ్లు మంజూరు అయ్యాయి. ఇందులో 6, 703 ఇండ్ల నిర్మాణానికి ముగ్గులు వేశారు. ఇందులో 2,196 ఇండ్లు బేస్మెంట్ వరకు నిర్మాణం జరిగింది. 202 ఇండ్లు రూప్ లెవల్ వరకు నిర్మాణం కాగా, 57 ఇండ్లు స్లాబ్ లెవల్ వరకు నిర్మాణమయ్యాయి.
అయితే ప్రధానంగా బేస్మెంట్ లెవెల్, రూప్ లెవల్ వరకు సాఫీగా నిర్మాణం జరుగుతున్నప్పటికీ బేస్మెంట్ తర్వాత రావలసిన నిర్మాణం డబ్బులు సకాలంలో రాకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నా రు. మరికొన్నిచోట్ల ఇండ్ల నిర్మాణానికి ముందుగానే లబ్ధిదారుల నుంచి స్థానిక నాయకులు, అధికారులు డబ్బులు వసూ లు చేశారని ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా ఆదిలాబాద్‌లో ప్రత్యేకంగా లబ్ధిదా రులకు మరో సమస్య ఎదురైంది.
జిల్లా కేంద్రంలోని 170 సర్వే నంబర్‌కాలనీతో పాటు పలు కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం పాత ఇండ్లను తీసేసి ఇండ్ల నిర్మాణానికి ముగ్గుపోయగా, పను లు ప్రారంభమయ్యాక ఇంటి నిర్మాణం చేపట్టే స్థలానికి డబుల్ రిజిస్ట్రేషన్‌లు ఉ న్నాయని.. తొలిదశ డబ్బులు రాకపోవడం తో చాలామంది లబ్ధిదారులు ఇబ్బందు లు పడుతున్నారు.
ఈ విషయమై 170 కాలనీ ఇంటి నిర్మాణ కమిటీ సభ్యురాలు ఆలం రూప నేతృత్వంలో ఇటీవల మున్సిపల్ కమిషనర్ రాజుకు సైతం విన్నవిం చడం జరిగింది. అటు ఉన్న ఇంటిని తొలగించి, ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం పనులు ప్రారంభిస్తే డబుల్ రిజిస్ట్రేషన్ అంటూ పనులు నిలిపివేశారని లబ్ధిదారు రాంబాయి పేర్కొన్నారు. ఇంటి నిర్మాణానికి లక్ష రూపాయలు అప్పుగా తె చ్చుకున్నమని, ఇప్పుడు పనులు నిలిపివేస్తే ఎలా అని ప్రశ్నించారు.