24-08-2025 10:31:29 AM
హైదరాబాద్: బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) ప్రారంభించిన చారిత్రాత్మక ఆరోగ్య ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ఆరోపించారు. నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తీసుకురావడానికి ఈ ఆసుపత్రులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వైద్యరంగానికి పెద్దపీట వేస్తూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలను మెరుగుపరిచి, జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీని స్థాపించి, జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో కొత్త ఆసుపత్రులు, పట్టణ ప్రాంత పేదల కోసం బస్తీ దవాఖానాలను కేసీఆర్ సర్కార్ నెలకొల్పిందని కేటీఆర్ తెలిపారు.
అంతే కాకుండా.. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువ చేయాలనే సంకల్పంతో, ఒక బృహత్ ప్రణాళికతో హైదరాబాద్ నగరానికి నలువైపులా 1,000 పడకల నాలుగు టిమ్స్(Telangana Institute of Medical Sciences) ఆసుపత్రులు, వరంగల్ నగరానికే తలమానికంగా 2,200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, 2,000 పడకలతో నిమ్స్ ఆసుపత్రి విస్తరణ పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు తుడిచేయడం ఎవరి తరం కాదని.. ఆరోగ్య తెలంగాణ దిశగా కేసీఆర్ సర్కార్ వేసిన అడుగులు చరిత్రలో నిలిచిపోతాయని పేర్కొన్నారు. నిర్మాణ దశలో ఉన్న ఈ ఆసుపత్రుల తాజా విజువల్స్ దానికి నిదర్శనమని తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేయకుంటే ఈపాటికే సరికొత్త హంగులతో ఈ ఆసుపత్రులన్నీ ప్రజలకు అందుబాటులోకి వచ్చేవని, ఈ ఆసుపత్రుల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, వైద్య సేవలు ప్రారంభించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని వెల్లడించారు.