07-05-2025 11:03:47 PM
జిల్లా అదనపు కలెక్టర్ వి విక్టర్..
కామారెడ్డి (విజయక్రాంతి): భూ భారతి చట్టం ప్రకారం భూ సర్వే చేసి పూర్తి వివరాలను పక్కాగా సేకరించి పరిశీలించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వి. విక్టర్(Revenue Additional Collector V. Victor) అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం నల్లమడుగు, పోతాయిపల్లి గ్రామాలలో భూ భారతి సర్వే టీమ్ లు క్షేత్ర పర్యటన చేసి సర్వే భూ వివరాలు, పాసు పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్న వాటి వివరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... ఏళ్ల తరబడి సాగుచేస్తున్న భూ వివరాలను సంబంధిత రెవిన్యూ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. చట్టం ప్రకారం భూముల వివరాలు సేకరించాలని, సేకరించిన వివరాలను డెస్క్ వర్క్ చేయాలనీ సూచించారు.
ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. అనంతరం లింగంపేట్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ను అదనపు కలెక్టర్ సందర్శించి, కొనుగోళ్ల వివరాలు, రైతుల వివరాలు, కేంద్రాల్లో వసతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యంను త్వరగా తూకం వేసి రైస్ మిల్లులకు తరలించాలని కేంద్రం నిర్వాహకులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ, పౌరసరఫరాల అధికారులు, కేంద్రం నిర్వాహకులు, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.