ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలు సాధించాలి
జిల్లా కలెక్టర్ కె.హైమావతి
సిద్దిపేట కలెక్టరేట్, జూన్ 18: జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని జిల్లా కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన ఆయిల్ పామ్ ప్లాంటేషన్ ప్రోగ్రెస్-2026-27 సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మెటీరియల్ కాంపోనెంట్ పనులను వేగవంతం చేసి నెలాఖరులోగా మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించారు.
రైతులతో సమన్వయం పెంచి భూముల క్లీనింగ్, పిట్ మార్కింగ్, పిట్టింగ్ పనులు త్వరగా పూర్తిచేయాలన్నారు. ఆయిల్ పామ్తో పాటు పండ్లు, పూలు, కూరగాయల సాగును ప్రోత్సహించాలని, ప్రతి రైతును ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేయాలని ఆదేశించారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రతి వ్యవసాయ క్షేత్రంలో ఫామ్ పాండ్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రీలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి, టీజీ ఆయిల్ఫెడ్ ప్రతినిధులు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.






