26 March, 2026 | 3:40 AM

పట్నంలో ‘పాత రాతియుగం పనిముట్లు’

26-03-2026 01:48 AM

మంచిరేవుల ఫారెస్టు ట్రాక్‌లో నీటికాలువ ఒడ్డున ఆనవాళ్లు

హైదరాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణా వైస్ ప్రెసిడెంట్ మీర్ ఒమర్ అలీఖాన్, కొత్త తెలంగాణా చరిత్రబృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ హైదరాబాద్ నగరం పరిసరాల్లో రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవుల ఫారెస్టు ట్రాక్‌లోని నీటికాలువ(వాగు) ఒడ్డున దిగువ పాతరాతియుగం పనిముట్లను గుర్తించారు.

వీటిలో పెద్దది 24 సెం.మీ.ల పొడవు, 27 సెం.మీ.ల చుట్టుకొలత, 130గ్రాముల బరువున్న క్వార్ట్ రాతి పనిముట్టును, 45 గ్రాముల బరువు, 15సెం.మీ.ల పొడవు, 21సెం.మీ.ల చుట్టుకొలత కలిగిన రాతి పనిముట్టును, 9సెం.మీ.ల పొడవు, 17సెం.మీ.ల చుట్టుకొలత, 30గ్రాముల బరువున్న మరొక రాతి పనిముట్టును గుర్తించారు. ఈ మూడు రాతి గొడ్డండ్లే. నాలుగవది చీల్పుడు రాతి పనిముట్టు. చివరిది రాతి పనిముట్టు చేయడానికి సిద్ధపరచిన కండరాయి లభించింది.

మొదటి రాతి పనిముట్టును ధార్వాడ్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ రవి కొరిసెట్టర్ దిగువ పాతరాతియుగానికి చెందిన రాతిపనిముట్టుగా గుర్తించారు. గతంలో ఈ మంచిరేవుల ఫారెస్టు ట్రాక్‌లోనే మధ్యరాతియుగాలనాటి రాతిచిత్రాలు, రాతిపనిముట్లు లభించాయి. ఈ అడివిలోనే నీటిని సేకరించడానికి తవ్విన నీటికాలువ, చిన్నపాటి వాగు పక్కన తవ్విపోసిన ఇసికెలో ఈ పాతరాతియుగం పనిముట్లు లభించడం విశేషం.

హైద్రాబాద్ నగరంలో మధ్యరాతియుగాలనాటి  (పదివేలయేండ్లు) రాతిచిత్రాలు, బిఎన్నార్ హిల్స్ లో కొత్తరాతియుగం పనిముట్లు(6వేలయేండ్లు) లభించాయి. చరిత్ర పూర్వయుగం ఆనవాళ్లు విస్తరించిన నగరం ఆక్రమణలో ఇంకెన్ని జాడ తెలియకుండా పోయాయో. ఇప్పటికైనా ఈ చారిత్రక జాడలను భద్రపరచి, భావితరాలకు తెలంగాణ చారిత్రక ప్రాభవాన్ని తెలియజేయాల్సిన బాధ్యత వుందని కొత్త తెలంగాణ చరిత్రబృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ అన్నారు.