21-11-2025 12:00:00 AM
నారాయణపేట.నవంబర్ 20 (విజయక్రాంతి) : నారాయణ పేట జిల్లాలో ఈ సారి పదో తరగతి ఫలితాలను శత శాతం సాధించేందుకు ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లాలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో 10వ తరగతి పరీక్షల గురించి, పాఠశాలల్లో పూర్తయిన సమ్మేటివ్ అసెస్మెంట్ -1 పరీక్షా ఫలితాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఎస్‌ఏ -1 పరీక్షల్లో వివిధ సబ్జెక్టులలో ఎక్కువ శాతం ఉత్తీర్ణత, తక్కువ శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల పై చర్చించారు. తక్కువ ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులను కారణాలు అడిగి వివరణ కోరారు. చాలా మంది హెచ్‌ఎంలు ఉపాధ్యాయుల కొరత ప్రధాన కారణంగా జవాబిచ్చారు. అయితే ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలల్లో వీలున్న పరిస్థితులను బట్టి స్థానికంగా వేరే వారిని నియమించాలని డిఈఓకు కలెక్టర్ సూచించారు.
అలాగే విద్యార్థుల ఉపస్థితి పైన సమీక్షించారు. ఎక్కువ సంఖ్యలో అనుపస్థితిలో ఉన్న విద్యార్థుల గురించి వెంటనే వారి తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థులు ఉపస్థితి మెరుగు పడటానికి చర్యలు తీసుకోవాలని హెచ్ ఎం లను ఆమె ఆదేశించారు. అదేవిధంగా వివిధ సబ్జెక్టులలో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ కావడంపై ఆయా పాఠశాలల ఉపాధ్యాయులతో హెచ్‌ఎంలు సమీక్షలు జరిపి కారణాలు విశ్లేషించి ఫలితాలు మెరుగు పర్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
జిల్లాలో అపార్ ఐడీల జనరేషన్ చాలా తక్కువ స్థాయిలో ఉందని, వెంబడే అందరూ ఎంఈఓలు వంద. శాతం అపార్ నమోదుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పదో తరగతిలో డీ గ్రేడ్‌లో ఉన్న విద్యార్థులను సీ గ్రేడ్‌కు, సీ గ్రేడ్ లో ఉన్న విద్యార్థులను బి గ్రేడ్‌కు, అలాగే బి గ్రేడ్‌లో ఉన్న విద్యార్థులను ఏ గ్రేడ్‌కు వచ్చేలా వారి నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని పెంపొందించాలని కలెక్టర్ సూచించారు.
మొత్తానికి ఈసారి పదో తరగతి పరీక్షా ఫలితాలలో నారాయణపేట జిల్లా వంద శాతం సాధించాలని కలెక్టర్ పునరుద్ఘాటించారు. ఈ సమీక్షా సమావేశంలో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్‌కుమార్, డీ ఈ ఓ గోవింద రాజులు, డీఈఓ కార్యాలయ అధికారులు విజయ్‌సాగర్, రాజేందర్, అన్ని మండలాల ఎంఈఓలు, జీహెచ్‌ఎంలు, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.