24 July, 2026 | 3:21 AM

బహుళ రంగాల్లో నైపుణ్యం సాధించాలి

24-07-2026 12:54 AM
  1. ఉద్యోగాలను సృష్టించేవారుగా ఉండాలి
  2. ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి

హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి) : వేగంగా మారుతున్న సాంకేతిక ప్రపంచంలో విద్యార్థులు నిరంతరం తమను తాము అప్డేట్ చేసుకుంటూ, బహుళ రంగా ల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ. బాలకిష్టా రెడ్డి పిలుపునిచ్చారు. కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రాజేంద్రనగర్‌లోని ఉద్యాన కళాశాల ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన ‘ఉద్యాన విద్య: ఉన్నత విద్యలో సాంకేతికత, కృత్రిమ మేధస్సు’ అంశంపై జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

క్రమశిక్షణ, అంకితభావం, సమయపాలన విద్యా ర్థులను ఉన్నత శిఖరాలకు చేర్చే ప్రధాన లక్షణాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని, ముఖ్యంగా కృత్రిమ మేధస్సును సమర్థవంతంగా వినియోగించుకుని తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఉద్యాన, వ్యవసాయ రంగాలతో పాటు విమానయానం, అంతరిక్ష సాంకేతికత, ఆధునిక సాంకేతిక రంగాలు, కృత్రిమ మేధస్సు వంటి విభాగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకునేందుకు సిద్ధం గా ఉండాలని పిలుపునిచ్చారు.

విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారిగా కాకుండా, ఉద్యోగాలను సృష్టించే వ్యవస్థాపకులుగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యాన విద్యను పూర్తిచేసిన అనంతరం స్టార్టప్లను స్థాపించి, ఆవిష్కరణల ద్వారా సమాజానికి సేవలందించే దిశగా ముందు కు సాగాలని సూచించారు. క్రమశిక్షణ, పట్టుదల, సమయపాలన విజయానికి మూల సూత్రాలని ఆయన పునరుద్ఘాటించారు.