24 July, 2026 | 3:03 AM

గడువులోగా డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి

24-07-2026 12:55 AM

కలెక్టర్ కుమార్ దీపక్ 

మంచిర్యాల, జూలై 23 (విజయక్రాంతి): జిల్లాలో ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములు లతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా సేకరించిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ దాదాపు 90 శాతం వరకు పూర్తయిందని, మిగిలిన మొత్తాన్ని నిర్ణీత గడువు కంటే ముందుగానే పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో అనామోలీస్ ఎక్కువగా ఉన్నాయని, ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత సంబంధిత ఓటర్లకు నోటీసులు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు.

నోటీసుల విషయంలో ఓటర్లు కంగారు పడవలసిన అవసరం లేదని, నోటీసులో పేర్కొన్న ధ్రువపత్రాలను సమర్పించడం ద్వారా ఓటు హక్కును పొందవచ్చని తెలిపారు. డబుల్, డెత్, షిఫ్ట్ అయినవారి ఓట్లను నిబంధనల ప్రకారం తొలగించడం జరుగుతుందని, ఇంకా ఎన్యూమరేషన్ ఫారాలు అందించని వారిని గుర్తించి బూత్ స్థాయి ఏజెంట్ల ద్వారా బూత్ స్థాయి అధికారులకు సమర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. డిజిటలైజేషన్ పూర్తయిన తర్వాత పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మోతిరాం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రకళ,  ఆర్డిఓ శ్రీనివాసరావు, ఎన్నికల విభాగం అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.