ఆరోగ్య నియమాలు పాటించాలి
కలెక్టర్ కె. హరిత
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్య నియమాలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. సోమవారం ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల విద్యార్థులు చేపట్టిన 2కే రన్ ర్యాలీని ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సీతారాం, వైద్య కళాశాల ప్రిన్సిపల్ సుబోద్ కుమార్‌తో కలిసి కలెక్టర్ కె. హరిత జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి రోజు నడక, వ్యాయామం వంటి శారీరక కార్యకలాపాలు చేయడం అవసరమని, ప్రతి ఒక్కరూ నిరంతరం ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ నెల 11 వరకు జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ‘ఆరోగ్యవారం’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కలెక్టరేట్ నుండి ర్యాలీ కుమ్రం భీం చౌక్ మీదుగా బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ చౌక్ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో అధికారులు, వైద్య కళాశాల నర్సింగ్ కళాశాల విద్యార్థులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.




