22-12-2025 12:00:00 AM
మైనార్టీ రెసిడెన్షియల్ క్రీడా ముగింపు పోటీల్లో కలెక్టర్ కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి) : విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సంస్కృతి సహా అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ప్రభుత్వం విద్య, క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ అధిక నిధులు కేటాయిస్తోందన్నారు. జిల్లాలో ప్రతిభ వంతులను వెలికితీయడం, క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం లక్ష్యంగా ఆదివారం బంగారు గూడ బాలికల మైనారిటీస్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (TMREIS) వేదికగా నిర్వహించిన జిల్లా స్థాయి గేమ్స్ & స్పోర్స్ మీట్ 202526 ముగింపు కార్యక్రమం వైభవంగా జరిగింది.
ఈ కార్యక్ర మానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం విజేత విద్యార్థులకు బహుమతులు, మెమొంటోలు, మెడ ల్స్‌ను కలెక్టర్ అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. క్రీడల్లో పాల్గొనడం ద్వారా నాయకత్వగుణం, జట్టు భావన పెంపొందుతాయని తెలిపారు. గెలిచిన వారిని అభినందిస్తున్నామని, ఓడిన వారు నిరుత్సాహపడకుండా మరింత కృషి చేసి వచ్చే పోటీల్లో విజయం సాధించాలని కోరారు.
జిల్లాల వారీగా ఖోఖో, పరుగుపందెం, బ్యాడ్మింటన్, కబడ్డీ, వాలీబాల్ సహా ఇతర క్రీడా విభాగాల్లో అదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల నుండి 550 మంది విద్యార్థులు పాల్గొని ప్రతిభాపాటవాలు ప్రదర్శించారని, 14 మం ది పిఇటీల ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించిన సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి కలీం, ప్రిన్సిపల్స్ ఫరిన్, పల్లవి, అధికారులు, ఉపాధ్యాయులు, పిఇటిలు, విద్యార్థులు పాల్గొన్నారు.