calender_icon.png 22 December, 2025 | 5:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

28, 29 తేదీల్లో రాష్ట్ర విద్యా సదస్సు

22-12-2025 12:00:00 AM

టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మల్లారెడ్డి 

మంచిర్యాల, డిసెంబర్ 21 (విజయక్రాంతి) : జనగామ జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ సయ్యద్ జియావుద్దీన్ ప్రాంగణం, కామ్రేడ్ రావెళ్ళ రాఘవయ్య వేదిక (మాంగళ్య ఫంక్షన్ హాల్)లో ఈ నెల 28, 29 తేదీల్లో రాష్ట్ర విద్యా సదస్సు, రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశాలు జరుగనున్నాయని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సామ మల్లారెడ్డి వెల్లడించారు. జిల్లా కేంద్రంలో ఆది వారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటిఎఫ్) జిల్లా విస్తృత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

విద్యారంగంలో ఎన్జీవోల పాత్ర పెరగడం వల్ల ఆందోళన కలిగిస్తోందని, పరోక్షంగా ప్రైవేటీకరణకు దారులు వేసే ప్రమాదం పొంచి ఉందన్నారు. ఉపాధ్యాయులను స్వేచ్ఛగా పాఠాలు చెప్పనివ్వాలని, బోధనేతర పనుల భారం నుంచి విముక్తులను చేయాలని, ఆన్ లైన్ నివేదికలు పంపడానికి బోధనేతర సిబ్బందిని కేటాయించాలని డిమాండ్ చేశారు. టెట్ పై సుప్రీం కోర్టు తీర్పు వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

జాతీయ స్థాయిలో ఉపాధ్యాయ సంఘాలు ఐక్య ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపా ధ్యాయుల ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేశారు. అనంతరం సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆడిట్ కమిటీ మెంబెర్ సి. లక్ష్మణ రావు, జిల్లా అధ్యక్షులు జి. చక్రపాణి, ప్రధాన కార్యదర్శి జి. రాజావేణు, జిల్లా ఉపాధ్యక్షులు వి. కిరణ్ కుమార్, జిల్లా కార్యదర్శులు జి. నర్సయ్య, కే. చంద్రమౌళి, జి. సంపత్, సీహెచ్. జైపాల్, యూ. తిరుపతి, కే. సతీష్, ఆర్. శ్రీధర్, రాములు తదితరులు పాల్గొన్నారు.