06-05-2025 07:41:59 PM
మావోయిస్టులతో కేంద్రం తక్షణమే చర్చలు జరపాలి..
మహబూబాబాద్ (విజయక్రాంతి): కర్రే గుట్టల ప్రాంతాల్లో ఉన్న సాయుధ బలగాలను యుద్ధ ప్రాతిపదికన ఉపసంహరించి, ఆపరేషన్ కగార్(Operation Kagar) ను వెంటనే నిలిపివేసి, మావోయిస్టులతో ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని, ఆదివాసీలపై హత్యాకాండ దాడులను నిలిపివేయాలని వామపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం(Round Table Conference) డిమాండ్ చేసింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వామపక్ష పార్టీల నాయకులు మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు గుణగంటి రాజన్న, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పెద్ద చంద్రన్న వర్గం జిల్లా కార్యదర్శి సనప పొమ్మయ్య, సిపిఐ ఎమ్మెల్ న్యూడెమోక్రసీ వైకే వర్గం నందగిరి వెంకటేశ్వర్లు, సిపిఐ ఎంఎల్ బుర్ర ఆనంద్, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కొత్తపల్లి రవి, ఎంసిపిఐయు పార్టీ నాయకులు కంచ వెంకన్న మాట్లాడుతూ... మూడవసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం మావోయిస్టులను పనికి వేయడానికి ఆపరేషన్ కగార్ పేరిట దేశంలో మరణ హోమం సృష్టిస్తోందని ఆరోపించారు.
ఆదివాసీలు నివసిస్తున్న ప్రాంతాల్లో దాడులు నిర్వహించి, అక్కడ ఉన్న ఖనిజ సంపదను కార్పోరేట్ కంపెనీలకు అప్పజెప్పడానికి ఆపరేషన్ కగార్ పేరిట అమాయకులను హత మారుస్తున్నారని ఆరోపించారు. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం వెంటనే శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. కర్రె గుట్టల ప్రాంతాల్లో మొహరించిన సాయుధ బలగాలను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ ఈనె 9న జిల్లా కేంద్రంలో ర్యాలీ, సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బి.అజయ్ సారధి రెడ్డి, సమ్మెట రాజమౌళి, భాస్కర్ రెడ్డి, రామ్మోహన్, పెరుగు కుమార్, దుడ్డేల రామ్మూర్తి, రేశ పల్లి నవీన్, బండపల్లి వెంకటేశ్వర్లు, బిక్షపతి, చింతకుంట్ల వెంకన్న, కట్లోజు పాండురంగ చారి, వరిపల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.