06-05-2025 10:36:54 PM
“శుభం’ చిత్రం ప్రభావం ప్రేక్షకులందరిపై పడాలని కోరుకుంటున్నా. దాదాపు మహిళలందరికీ సీరియల్స్ అంటే పిచ్చి ఉంటుంది. ఈ సినిమాలో సోషల్ సెటైర్ ఉంటుంది కానీ.. మెస్సేజ్ ఉంటుందా? లేదా? అన్నది మీరే (ప్రేక్షకులు) తెలుసుకోండి. ఓ అభిమాని నాకు గుడి కట్టారని తెలిసి ఆశ్చర్యపోయా. కానీ ఇలా గుళ్లు కట్టి, పూజలు చేసే పద్ధతిని నేను ఏమాత్రం ప్రోత్సహించను” అని చెప్పారు నటి సమంత. తన సొంత ప్రొడక్షన్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై సమంత ‘శుభం’ అనే సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మే 9న విడుదలవుతోంది. ఈ క్రమంలో సమంత మంగళవారం మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె పైవిధంగా స్పందించారు. ఇంకా చెప్పిన విశేషాలేంటో చదివేయండి..
* నటిగా ఓ శుక్రవారం ఎలా ఉంటుందో నాకు అనుభవం ఉంది. కానీ నిర్మాతగా ఇది నాకు మొదటి శుక్రవారం. ఎంతో నర్వెస్‌గా ఉన్నా. నిర్మాతకు ఎన్ని కష్టాలు ఉంటాయో నాకిప్పుడు అర్థమవుతోంది. గత వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా. పోస్ట్ ప్రొడక్షన్ టీమ్, మిక్సింగ్ టీమ్, ఎడిటింగ్.. ఇలా అందరూ నిద్ర లేకుండా పనిచేస్తున్నారు. నాకు నా టీమ్ మీద మరింత గౌరవం పెరిగింది. ‘శుభం’ చాలా బాగా వచ్చింది. మంచి కథ. సినిమాపై నాకు చాలా నమ్మకం ఉంది.
* నటిగా నేను ఎంతో చూశా.. ఎంతో అభిమానం లభించింది. కానీ ఇంకా ఏదో చేయాలనే తపన, కోరిక మాత్రం ఉంటూ వచ్చింది. నేను తీసుకున్న ఆ బ్రేక్ టైమ్‌లో చాలా ఆలోచించా. హీరోయిన్‌గా నేను ఏ సినిమాలూ చేయలేకపోయా. అసలు ఇక సినిమాల్లో నటిస్తానో కూడా తెలియని సమయంలో నిర్మాతగా మారాలన్న ఆలోచన వచ్చింది. నటించకపోతేనేం సినిమాలు నిర్మించొచ్చు కదా అని అనుకున్నా. కెరీర్ మొదలుపెట్టి దాదాపు 15 ఏళ్లు అయింది. నాకు ఇంత అనుభవం ఉంది కదా అని ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేశా. ఎలాంటి హడావిడి లేకుండా సినిమాను ప్రారంభించాం. 8 నెలల్లోనే పూర్తిచేశాం. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం.
* ‘శుభం’ అనే టైటిల్ పెట్టడానికి కారణం ఉంది. ఈ చిత్రంలో ఎక్కువగా సీరియల్ గురించి ఉంటుంది.. ఆ సీరియల్‌లో శుభం కార్డు ఎప్పుడు పడుతుందా? అని అంతా ఎదురుచూస్తుంటారు. అందుకే ఆ టైటిల్ పెట్టాం. ఇక నా ప్రొడక్షన్ కంపెనీకి ట్రా లా లా అని పెట్టడానికి కూడా కారణం ఉంది. చిన్నప్పుడు ‘బ్రౌన్ గర్ల్ ఇన్ ది రెయిన్’ అనే పద్యం ఉండేది. అందుకే ‘ట్రా లా లా’ అని పెట్టాం.
* గౌతమ్ మీనన్ నాకు మొదటి ఛాన్స్ ఇచ్చారు. ఆయన తలుచుకుంటే ఆ టైమ్‌లో ఏ టాప్ హీరోయిన్‌నైనా తీసుకోవచ్చు. కానీ ఆయన నాలాంటి కొత్తవారికి అవకాశమిచ్చారు. నేను కూడా నిర్మాతగా కొత్తవారిని ప్రోత్సహించాలనే లక్ష్యంతోనే ఉన్నా.
* ఎన్నో కలలు కంటూ సినిమా పరిశ్రమలోకి వస్తారు. మా చిత్రం కోసం శ్రియా, శ్రావణి, షాలినీలు ఎంతో కష్టపడ్డారు. నా సినిమాలో నటించిన వారందరినీ చూస్తే నా పాత రోజులన్నీ గుర్తుకు వచ్చాయి.
* నటిగా ఉన్నప్పుడు నిర్మాత కష్టాలేవీ నాకు అర్థం కాలేదు. ఒక్కరోజు ఒక్క సీన్ అనుకున్నట్టుగా జరగకపోతే ఎంత నష్టం వస్తుంది.. డబ్బు ఎంత వృథా అవుతుందో నాకు ఇప్పుడు తెలిసివచ్చింది. ఎంతో మంది టైమ్ వేస్ట్ అవుతుందని అర్థమైంది.
* ‘శుభం’ చిత్రంలోని క్యామియో పాత్రను నేను చేయాల్సింది కాదు. కానీ నిర్మాతగా మొదటిసారిగా నేను ఎవరి దగ్గరకు వెళ్లి ఫేవర్ అడగాలని అనుకోలేదు. అందుకే ఆ పాత్రను నేనే పోషించా. నేను ఈ చిత్రాన్ని ఇంకో మూడు, నాలుగు రోజులు మాత్రమే ప్రమోట్ చేయగలను. కానీ ఆ తర్వాత ఈ సినిమా భారమంతా ప్రేక్షకుల మీదే ఉంటుంది.
* ‘శుభం’ చిత్రానికి ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టాం. సినిమా చూస్తే అందరికీ ఆ విషయం అర్థమవుతుంది. తక్కువ పెట్టలేదు.. అలా అని ఎక్కువ ఖర్చు పెట్టలేదు. ప్రతీ సినిమాకు, కథకు ఎంత కావాలో అంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది.
* ప్రస్తుతం నేను ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రాన్ని చేస్తున్నా. జూన్ నుంచి మళ్లీ షూట్‌కు వెళ్తున్నాం. షూట్ ప్రారంభమయ్యాక మళ్లీ అప్డేట్లు వస్తుంటాయి. అట్లీతో నాకు చాలా మంచి రిలేషన్ ఉంది. భవిష్యత్తులో మేమిద్దరం కలిసి ప్రాజెక్ట్ చేస్తామేమో చూడాలి.
* ‘శుభం’ చిత్రానికి వసంత్ కథను అందించారు. ఈ మూవీ చూసిన తర్వాత ప్రతీ ఆడియెన్స్ మీద ప్రభావం చూపించాలని కోరుకున్నా. దాదాపు మహిళలందరికీ సీరియల్స్ అంటే పిచ్చి ఉంటుంది. ఇది జనరల్ హారర్, కామెడీ అనేలా మాత్రం ఉండదు. సోషల్ సెటైర్ ఉంటుంది కానీ.. మెస్సేజ్ ఉంటుందా? లేదా? అన్నది ప్రేక్షకులే తెలుసుకోవాలి.
* నాకు నేనే ఓ పెద్ద విమర్శకులురాలిని. ఏ సినిమాలో ఎక్కడ తప్పు చేశానో నాకు తెలుస్తుంది. ఈ చిత్రంలో ఎలాంటి తప్పులు జరగకూడదని ఎడిటింగ్ టేబుల్ వద్ద చాలా కష్టపడ్డాం. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా ఉండేలా సినిమాను కట్ చేశాం.
* ఎప్పుడైనా నేను నా మనసుకు నచ్చిందే చేశాను. నేనొక స్మార్ట్ ప్రొడ్యూసర్‌ను కాకపోవచ్చు.. నాకు బిజినెస్ గురించి అంతగా తెలియకపోవచ్చు.. కానీ, ఈ సినిమా నా మనసుకు నచ్చింది కాబట్టి చేశాను. అందరి అంచనాలకు తగ్గట్టుగా ఈ చిత్రం ఉంటుందని మాత్రం చెప్పగలను.
* ఓ అభిమాని నా కోసం గుడి కట్టారని తెలిసి ఆశ్చర్యపోయాను. నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారా? అని అనుకున్నా. ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. అది అతని ప్రేమను చూపించే తీరు అని అనిపించింది. కానీ ఇలా నాకు గుళ్లు కట్టి, నాకు పూజలు చేసే పద్ధతిని మాత్రం నేను ఎంకరేజ్ చేయలేను.
* ‘శుభం’ చిత్రానికి మంచి డేట్ దొరికింది. మే 9 అనేది సమ్మర్ హాలీడేస్‌లో ఉంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేందుకు వీలుంటుంది. మంచి డేట్ దొరకడం మా అదృష్టం. క్లింటన్ సెరెజో సంగీతం బాగుంటుంది. పాత రోజులకు తీసుకు వెళ్లేలా పాటలు ఉంటాయి. వివేక్‌సాగర్ బీజీఎం అందరినీ ఆకట్టుకుంటుంది. మే 9న రిలీజ్ అవుతున్న మా ‘శుభం’ సినిమాను అందరూ చూసి సక్సెస్ చేయండి.