ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలి
సిద్దిపేట, జూన్ 9 (విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలపై భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ)గా నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తూనే ఉంటామని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ అన్నారు. సోమవారం సిద్దిపేట రూరల్ మండలం 2వ మండల మహా సభ రాఘవపూర్ గ్రామంలో జరిగింది.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల భవిష్యత్ అంధకారంలోకి నెట్టి వేయబడిందని, రోజురోజుకీ దేశంలో పేదరికం పెరిగిపోతుందని అన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో బూటకపూ ఎన్కౌంటర్లు చేస్తూ అమాయక ఆదివాసీ, గిరిజనుల ప్రాణాలు తీస్తూ ధమనకాండ కొనసాగిస్తున్నరని, ఆపరేషన్ కగార్ ను నిలివేయాలని డిమాండ్ చేశారు.
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల నిర్మాణ భాద్యులు కనుకుంట్ల శంకర్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కిష్టపురం లక్ష్మణ్, మండల కార్యదర్శి మిట్టపల్లి సుధాకర్, సంజీవ్, మల్లయ్య, వెంకట్, మల్లేష్, మిట్టపల్లి నవీన్, రాజయ్య పాల్గొన్నారు.






