calender_icon.png 1 July, 2025 | 8:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

తల్లిపై కొడుకు పెట్రోల్ దాడి.. చికిత్స పొందుతూ తల్లి మృతి

01-07-2025 02:02:11 PM

వరంగల్: వరంగల్ జిల్లాలో ఆర్థిక వివాదం కారణంగా ఓ వ్యక్తి తన సొంత తల్లిని తగలబెట్టిన దారుణ సంఘటన కలకలం రేపింది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న ఆ తల్లి మంగళవారం ఉదయం చికిత్స పొందుతూ మరణించింది.  వివరాల్లోకి వెళితే.. బాధితురాలు వినోద(60), ఆమె భర్త ముత్తినేని సాంబయ్య సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందినవారు. ఈ దంపతులకు ఒక కుమార్తె స్వరూప, కుమారుడు సతీష్ ఉన్నారు. ఇద్దరికి వివాహం అయింది. కాకతీయ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ ప్రాజెక్ట్ కోసం సేకరించిన భూమికి పరిహారంగా ఆ కుటుంబానికి ఇటీవల రూ. 40 లక్షలు ప్రభుత్వం ఇచ్చింది.

ఇందులో రూ.30 లక్షలు సతీష్ కు ఇచ్చారు. అయితే, సతీష్ తనకు మరిన్ని డబ్బులు కావాలని డిమాండ్ చేయడంతో ఉద్రిక్తతలు తలెత్తాయి. మిగిలిన డబ్బులను బ్యాంకు ఖాతాలో జమ చేసి రూ.6 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా చేశారు. మూడు నెలల క్రితం సతీష్ తన తల్లిదండ్రులను తమ దగ్గర ఉన్న డబ్బులను ఇవ్వాలని డిమాండ్ చేశాడు. వారు కాదనడంతో నిప్పంటించుకుంటానని బెదిరించాడు.

తల్లిదండ్రుల దగ్గర ఉన్న డబ్బులను తమ కూతురికి కాకుండా తనకే ఇవ్వాలంటూ వాగ్వాదానికి దిగాడు. గొడవ కాస్త ముదరడంతో ఇంట్లో నిద్రిస్తున్నప్పుడు తల్లి వినోదపై సతీష్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను భర్త సాంబయ్య, పొరుగువారి సహాయంతో మంటలను ఆర్పి, ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. గత మూడు రోజులుగా చికిత్స పొందుతున్న వినోద మంగళవారి ఉదయం తుది శ్వాస విడిచిందని పోలీసులు వెల్లడించారు.